న్యూయార్క్: యుఎస్ ఓపెన్‌లో హాట్ ఫేవరెట్ రఫెల్ నాదల్ జోరు కొనసాగిస్తూ.. క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్ నాదల్ 6-3, 6-3, 6-7 (6-8), 6-4తో బసిల్ష్వెలి (జార్జియా)ను ఓడించాడు. మూడో సీడ్ డెల్‌పొట్రో 6-4, 6-3, 6-1తో బొర్నా కొరిచ్ (క్రొయేషియా)ను ఓడించగా.. తొమ్మిదో సీడ్ డొమినిక్ థీమ్ 7-5, 6-2, 7-6 (7-2)తో ఐదో సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై విజయం సాధించాడు.
అమెరికా ఆటగాడు జాన్ ఇస్నర్ 3-6, 6-3, 6-4, 3-6, 6-2తో రోనిచ్ (కెనడా) పోరాటానికి తెర దించాడు. ప్రిక్వార్టర్స్‌లో నిషికొరి (జపాన్) 6-3, 6-2, 7-5తో కోల్స్క్రైబర్ (ఆస్ట్రియా)పై విజయం సాధించాడు. మరోవైపు మాజీ ఛాంపియన్ సెరెనా విలియమ్స్ కూడా చివరి ఎనిమిదిమంది జాబితాలో చోటు సంపాదించింది. డొమినిక్ థీమ్, డెల్‌పొట్రో, మాడిసన్ కీస్, ప్లిస్కోవా, స్లోన్ స్టీఫెన్స్ కూడా క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.
మహిళల సింగిల్స్‌లో టైటిల్‌పై గురి పెట్టిన సెరెనా ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ప్రిక్వార్టర్స్‌లో సెరెనా 6-0, 4-6, 6-3తో కయా కనెపి (ఇస్తోనియా)ను ఓడించింది. ఎనిమిదో సీడ్ ప్లిస్కోవా 6-4, 6-4తో బార్టీ (ఆస్ట్రేలియా)ను ఓడించగా.. మూడో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ 6-3, 6-3తో మెర్టెన్స్ (జర్మనీ)ను చిత్తు చేసింది. పద్నాలుగో సీడ్ మాడిసన్ కీస్ 6-1, 6-3తో సిబుల్కోవా (స్లొవేకియా)పై విజయం సాధించింది.
క్వార్టర్స్‌లో బోపన్న జోడీ: పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న క్వార్టర్ఫైనల్లో ప్రవేశించాడు. ప్రిక్వార్టర్స్‌లో బోపన్న-రోజర్ వెస్లిన్ (ఫ్రాన్స్) జోడీ 7-6 (8-6), 4-6, 6-3తో చార్డీ-మార్టిన్ (ఫ్రాన్స్)ను ఓడించింది. టైబ్రేకర్ వరకు వెళ్లిన తొలి సెట్లో 7-6 (8-6)తో గెలిచిన బోపన్న జంట.. రెండో సెట్లో 4-6తో కోల్పోయింది. అయితే మూడో సెట్లో రెండుసార్లు ప్రత్యర్థి సర్వీసు బ్రేక్ చేసిన బోపన్న జంట 6-3తో సెట్ పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది.