
హైదరాబాద్: డోపింగ్ నిరోధక చర్యలు తనకు అయోమయాన్ని కలిగిస్తున్నాయని, మిగతా క్రీడాకారిణులతో పోలిస్తే తనకే ఎక్కువ సార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహించడంపై అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఆవేదన వ్యక్తం చేశారు. వింబుల్డన్ ఆడుతున్న సమయంలో తనను లక్ష్యంగా చేసుకొని మరీ పరీక్షలు చేశారని ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొంది.
''మరోసారి డోపింగ్ పరీక్షకు హాజరయ్యా. మళ్లీ సెరెనాకు మాత్రమే ఇది జరిగింది. మిగతా క్రీడాకారిణుల కన్నా నన్నే ఎక్కువ సార్లు ఎందుకు పరీక్షిస్తున్నారు? నాపై ఈ వివక్ష ఎందుకు? ఏదైతేనేం చివరికి నేనన్నా ఆటలను స్వచ్ఛంగా ఉంచుతున్నాను, #stayPositive" అని సెరెనా విలియమ్స్ ట్వీట్ చేసింది.
ఈ ఏడాదిలో సెరెనా విలియమ్స్‌కు ఆరుసార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. దీంతో అమెరికా డోపింగ్ నిరోధక అధికారులు అందరి కన్నా తనకే ఎక్కువ సార్లు పరీక్షలు నిర్వహిస్తున్నారని ఇక్కడా తాను వివక్ష ఎదుర్కొంటున్నానని సెరెనా తెలిపింది. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన సెరెనా విలియమ్స్ తీవ్ర అస్వస్థతకు గురైంది.
ఈ నేపథ్యంలో సెరెనా కఠినమైన శస్త్రచికిత్స చేయించుకుంది. తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టిన సెరెనా ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. మహిళల సింగిల్స్ వింబుల్డన్ ఫైనల్లో పదకొండో సీడ్ కెర్బర్ 6-3, 6-3తో వరుస సెట్లలో సెరెనా విలియమ్స్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.