శరవేగంగా దూసుకుపోతున్న సెరెనా, బటిస్ఠాతో జకోవిచ్ పోరాటం

హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్‌లో రోలాండ్ గారోస్‌లో అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్
దూసుకెళుతోంది. తల్లిగా మారినా..తనలో చేవ తగ్గలేదని తన ఆటతీరుతో చాటిచెప్పింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే బార్టీ చేతిలో తొలిసెట్ ఓడి వెనుకబడినా సెరెనా పుంజుకున్న తీరు వారెవ్వా అనిపించింది. గురువారం అర్ధరాత్రి జరిగిన రెండోరౌండ్ మ్యాచ్‌లో 3-6, 6-3, 6-4 స్కోరుతో ఆష్లే బార్టీని ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ మూడోరౌండ్ చేరింది.
మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సెరెనా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మళ్లీ తన పునరాగమనాన్ని ఘనంగా చాటింది. కళ్లు చెదిరే సర్వీసులు, భారీ ర్యాలీలకు అవకాశం ఇవ్వకుండా ప్లేస్‌మెంట్స్‌తో మళ్లీ అలనాటి సెరెనాను కోర్టులో తలపించింది. రెండోరౌండ్ మ్యాచ్‌లో డెన్మార్క్ భామ కరోలినా వోజ్నియాకి 6-0,6-3 స్కోరుతో పార్మెంటైర్‌ను సునాయాసంగా ఓడించి మూడోరౌండ్ చేరగా, రెండోరౌండ్‌లో స్విటోలినాకు 6-3,7-5 స్కోరుతో బుజారెన్స్యూ షాకిచ్చింది. అమెరికా అమ్మాయి కైస్ 6-1,7-6(9-7) స్కోరుతో జపాన్ భామ నవోమి ఒసాకాపై నెగ్గింది.

సెరెనా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మళ్లీ తన పునరాగమనాన్ని:
‘మళ్ళీ రాకెట్ పట్టడం ఆనందంగా ఉంది. తొలి సెట్ కోల్పోయాక మరింత గట్టిగా పోరాడాలని అనుకున్నా. శనివారం వీనస్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడతా. సింగిల్స్‌తో పాటు డబుల్స్ ఆడటంపై నాకెలాంటి ఇబ్బందుల్లేవు. నూటికి నూరు శాతం ప్రదర్శన ఇస్తా. అత్యుత్తమ క్రీడాకారిణిగా నిలిచేందుకు శాయశక్తులా కృషి చేశానని కూతురుకు చెప్పే స్థితిలో నేనుండాలి' అని సెరెనా చెప్పింది.

అతి కష్టంపై నెగ్గుకొస్తున్న జొకోవిచ్:
సెర్బియా స్టార్ జొకోవిచ్ అతి కష్టంపై నెగ్గుకొస్తున్నాడు. వరుసగా గాయాలతో, ఫాంలేమితో వెనుకబడిన జొకోవిచ్ ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్‌లో ప్రి క్వార్టర్స్ చేరుకున్నాడు. శుక్రవారం స్పెయిన్ ఆటగాడు, ప్రపంచ 16వ సీడ్ బటిస్టాను 6-4, 6-7(6), 7-6(4), 6-2 స్కోరుతో చిత్తు చేసిన జొకోవిచ్ తుది 16 మందిలో చోటు దక్కించుకున్నాడు.

బటిస్టా అద్భుతమైన ఆటతీరు:
అనూహ్యంగా బటిస్టా పోరాడడంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడానికి 4గంటలపాటు పోరాడాల్సి వచ్చింది. తొలిసెట్ గెలుచుకుని ఊపుమీదున్న జొకోవిచ్‌కు రెండోసెట్ విజయంతో బటిస్టా షాకిచ్చాడు. మూడోసెట్‌ను ట్రై బ్రేకర్‌లో గెలుచుకున్న జొకోవిచ్ నాలుగోసెట్‌ను 6-2తో గెలుచుకుని మ్యాచ్‌ను ముగించాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ఈ విధంగా పోరాడాలని కోరుకోవడం లేదని, అద్భుతమైన ఆటతీరును బటిస్టా ప్రదర్శించడంతో విజయం ఆలస్యమైందని జొకో అన్నాడు.

అలెగ్జాండర్ జ్వెరెవ్:
జర్మనీ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్ 2 అలెగ్జాండర్ జ్వెరెవ్ ఐదుసెట్ల హోరాహోరీ పోరాటంతో నాలుగోరౌండ్ చేరాడు. బోస్నియాకు చెందిన 26వ ర్యాంకర్ దామిర్ జుమ్‌హుర్‌ను 6-2, 3-6, 4-6, 7-6(3), 7-5 స్కోరుతో ఓడించాడు. చివరిసెట్లో మ్యాచ్ పాయింట్‌ను కాచుకుని మరీ జ్వెరెవ్ విజయంతో తొలిసారిగా ఫ్రెంచ్‌ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్ చేరాడు.

గ్రిగోర్ దిమిత్రోవ్ కథ ముగిసి:
రష్యా ఆటగాడు నాలుగోసీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ కథ ముగిసింది. మూడోరౌండ్ పోరులో 7-6(4),6-2 ,6-4 స్కోరుతో స్పెయిన్ వెటరన్ ఫెర్నాండో వెర్దాస్కో విజయంతో ప్రి క్వార్టర్స్ చేరుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు డొమినిక్ థీమ్ 6-3,6-7(5-7),6-3,6-2 స్కోరుతో బెరెట్నిపై విజయంతో ముందంజ వేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications