
హైదరాబాద్: బిడ్డకు జన్మనివ్వడమంటే ఏ మహిళ అయినా చచ్చి బతకాల్సిందే. సెరెనా విలియమ్స్‌కు అలాగే జరిగింది కానీ, ఆమె ప్రాణాల మీదకు వచ్చింది. ఊపిరి కూడా ఆగిపోయిందంటూ ఇటీవల ఆమె తన ఆవేదన వెల్లగక్కింది. 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల విన్నర్ సెరెనా విలియమ్స్ 35ఏళ్ల వయస్సులో ఓ పాపకు జన్మనిచ్చి మృత్యువును సైతం గెలిచింది.
మాజీ ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ గతేడాది సెప్టెంబరు 1న ఒలింపియా అనే పాపకు జన్మనిచ్చింది. సీ సెక్షన్ సిజేరియన్‌తో ఈ ఆపరేషన్ నుంచి ఆమె బయటపడింది. ప్రసవం తర్వాత కొద్ది రోజులు ఆమె ప్రాణాలతో పోరాటం చేయక తప్పలేదు. ఇదే విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ..' అదృష్టం ఉంది కాబట్టే నేను బయటపడగలిగాను. సీ టైపు సర్జరీతో పాపకు జన్మనిచ్చాను. ప్రసవం అనంతరం నాకు ప్రాణాలు పోయినంత పని అయింది.' అని చెప్పింది.
ఇంకా మాట్లాడుతూ.. 'ఊపిరితిత్తులకు రక్తం సరఫరా అవడం ఆగిపోయింది. రక్తం చిన్న పరిమాణంలో గడ్డ కట్టడంతో శ్వాస అందుకోలేకపోయాను. హఠాత్పరిణామానికి స్పందించిన నర్సులు వెంటనే వైద్యుడిని అప్రమత్తం చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాను. ఆ క్షణం నాకు చచ్చిపోతానేమో అనిపించింది. వైద్యులు సర్జరీ చేసి గడ్డకట్టిన మూడు భాగాల్లో క్లియర్ చేశారు. దాంతో ప్రమాదం నుంచి బయటపడ్డాను' అని ఆమె తన విషాదాన్ని వివరించింది.
ఇలా తన ఊపిరితిత్తుల దగ్గర ప్రాంతంలో సర్జరీ జరగడంతో ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకున్నట్లు ఆమె పేర్కొంది. కాగా, ఆరోగ్యం సరిగా లేదని ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కు హాజరుకాలేకపోయింది సెరెనా.