హైదరాబాద్: సెరెనా విలియమ్స్... పరిచయం అక్కర్లేని పేరు. 23 గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు..4 ఒలింపిక్ బంగారు పతకాలు.. వివాదాలకు దూరం.. ఇదీ ఆమె గొప్పదనం. అయితే ఆమె శరీర రంగుని చూసి మగరాయుడిలాగా ఉంటుందని ఎంతోమంది వెక్కిరించారు.
అంతేకాదు ఆమె ఆటలో పవర్ తప్ప అందం లేదని ఎన్నోసార్లు విమర్శలు వచ్చాయి. వాటన్నింటికీ సెరెనా తన ఆటతోనే సమాధానం చెప్పేది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తాజాగా తనకు పుట్టబోయే బిడ్డపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సెరెనాను తీవ్రంగా కలిచివేసింది.

వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ఫెడరేషన్ కప్‌లో భాగంగా రొమేనియా-బ్రిటన్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో రొమేనియా కెప్టెన్ ఇల్లీ నాస్టేస్.. సెరెనాకు పుట్టబోయే బిడ్డపై జాతివివక్షాపూరిత వ్యాఖ్యలు చేశాడు. తాను ఏడు వారాల గర్భవతిని అంటూ సెరెనా ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఆమెకు పుట్టబోయే బిడ్డ రంగు ఏంటి? 70 ఏళ్ల నాస్టేస్ వ్యాఖ్యానించాడు. సెరెనా నల్ల జాతి.. ఆమె ఫియాన్సీ (ప్రియుడు) తెల్లజాతి. మరి.. వీరిద్దరి కలయికతో పుట్టే పాప ఎలా ఉంటుంది. పాలలో చాక్లెట్ కలిపితే వచ్చే రంగును పోలిఉంటుందా? అని నాస్టేస్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు.
ఈ వ్యాఖ్యలను తప్పుపట్టిన అంతర్జాతీయ టెన్నిస్ సంఘం(ఐటీఎఫ్) తక్షణమే నాస్టేస్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. నాస్టేస్ కామెంట్స్‌పై సెరెనా తీవ్రంగా మండిపడింది. 'నాతో పాటు ఇంకా పుట్టని నా బిడ్డపై అభ్యంతరకరంగా వర్ణవివక్ష వ్యాఖ్యలు చేసిన నాస్టేస్ లాంటివారు జీవిస్తున్న సమాజంలో ఉండడం తీవ్రమైన బాధను కలిగిస్తోంది. నీ మాటల తూటాలతో నన్ను కాల్చావు. నీ అసహ్యంతో నన్ను చంపాలని చూశావు. కానీ నేను గాలిలా నిరంతరం ప్రసరిస్తుంటాను' అని సెరెనా ట్విట్టర్ ద్వారా తీవ్రంగా స్పందించింది.