For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Serena Williams: క్రిస్‌ ఎవర్ట్‌ రికార్డు బద్దలు.. యుఎస్‌ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన సెరెనా!!

Serena Williams breaks Chris Evert’s record for most singles matches won at US Open

న్యూయార్క్‌: కరోనా వైరస్‌ భయంతో యూఎస్‌ ఓపెన్‌ టోర్నీకి టాప్‌-10లోని ఆరుగురు క్రీడాకారిణులు గైర్హాజరీ అయిన విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. చరిత్రలో స్థానం సంపాదించేందుకు అమెరికా మహిళా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ తొలి అడుగు వేసింది. గత రెండేళ్లలో ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌ ట్రోఫీతోనే సరిపెట్టుకున్న సెరెనా.. ఈసారి ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మూడో సీడ్‌ సెరెనా 7-5, 6-3తో తన దేశానికే చెందిన క్రిస్టీ ఆన్‌పై విజయం సాధించింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లోసెరెనా 13 ఏస్‌లు సంధించింది.

కెరీర్‌లో 20వసారి యూఎస్‌ ఓపెన్‌లో ఆడుతున్న సెరెనా విలియమ్స్‌.. తాజా గెలుపుతో ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా (పురుషుల, మహిళల సింగిల్స్‌ విభాగాలు కలిపి) నిలించింది. 101 విజయాలతో క్రిస్‌ ఎవర్ట్‌ (అమెరికా) పేరిట ఉన్న ఈ రికార్డును సెరెనా అధిగమించింది. ఒకవేళ సెరెనా ఈసారి చాంపియన్‌గా నిలిస్తే.. అత్యధికంగా ఏడుసార్లు యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పుతుంది.

'యూఎస్‌ ఓపెన్‌లో ఆడేందుకు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక రికార్డు బద్దలు కొట్టానని నాతో చెబుతుంటారు. అయితే నేనెప్పుడూ రికార్డుల కోసం ఆడలేదు. వాటి గురించి ఆలోచించడంలేదు. టైటిల్‌ గెలవడమే నా ముందున్న లక్ష్యం' అని మ్యాచ్ అనంతరం సెరెనా అన్నారు. 1998లో ఈ టోర్నీలో అరంగేట్రం చేసిన సెరెనా ఆరుసార్లు విజేతగా (1999, 2002, 2008, 2012, 2013, 2014).. నాలుగుసార్లు రన్నరప్‌గా (2001, 2011, 2018, 2019) నిలిచింది. 2003, 2017 ఈ టోర్నీలో ఆడలేదు.

మరో మ్యాచ్‌లో వీనస్‌ విలియమ్స్‌ 3-6, 5-7తో ముచోవా (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో ఓడింది. 40 ఏళ్ల వీనస్‌.. 25 ఏళ్ల ముచోవా జోరు ముందు నిలవలేకపోయింది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌లో క్లియ్‌స్టర్స్‌ (బెల్జియం) 6-3, 5-7, 1-6తో అలెగ్జాండ్రోవా (రష్యా) చేతిలో పరాజయం పాలైంది. రెండో సీడ్‌ కెనిన్‌ (యుఎస్‌ఏ), అయిదో సీడ్‌ సబాలెంకా (బెలారస్‌), ఏడో సీడ్‌ కీస్‌ (యుఎస్‌ఏ), కొంటా (బ్రిటన్‌), స్టీఫెన్స్‌ (యుఎస్‌ఏ), అజరెంకా (బెలారస్‌) కూడా రెండో రౌండ్‌ చేరారు. ఆరో సీడ్‌ క్విటోవా (చెక్‌), మాజీ నంబర్‌వన్‌ కెర్బర్‌ (జర్మనీ) మూడో రౌండ్లో ప్రవేశించారు. మార్టిచ్‌, గ్రచేవా, కొంటావిట్‌, సస్నోవిచ్‌ కూడా మూడో రౌండ్లో అడుగుపెట్టారు.

మాజీ నంబర్‌వన్‌ ముర్రే (బ్రిటన్‌) అతికష్టం మీద తొలి రౌండ్‌ దాటాడు. అతను 4-6, 4-6, 7-6 (7/5), 7-6 (7/4), 6-4తో నిషియోక (జపాన్‌)పై గెలుపొందాడు. 4 గంటల 39 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన పోరులో పోరాడి గెలిచాడు. రెండో సీడ్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 7-6, 7-6, 6-3తో మునార్‌ (స్పెయిన్‌)పై, మూడో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) 6-1, 6-2, 6-4తో డెల్బోనిస్‌ (అర్జెంటీనా)పై, ఆరో సీడ్‌ బెరెట్టిని (ఇటలీ) 7-6 (7/5), 6-1, 6-4తో సోయిదా (జపాన్‌)పై గెలిచారు. దిమిత్రోవ్‌ (బల్గేరియా), రోనిచ్‌ (కెనడా), బటిస్టా (స్పెయిన్‌), సిలిచ్‌ (క్రొయేషియా), కచనోవ్‌ (రష్యా) కూడా ముందంజ వేశారు. పురుషుల డబుల్స్‌లో దివిజ్‌ శరణ్‌ జోడీ కథ తొలి రౌండ్లోనే ముగిసింది. దివిజ్‌, కసిచ్‌ (సెర్బియా) జంట 4-6, 6-3, 3-6తో కూలోఫ్‌ (నెదర్లాండ్స్‌), మెక్టిచ్‌ (క్రొయేషియా) ద్వయం చేతిలో ఓడిపోయింది.

Story first published: Thursday, September 3, 2020, 8:06 [IST]
Other articles published on Sep 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+