
హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లో నల్ల సూట్ ధరించి ఆడొద్దని ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్(ఎఫ్‌ఎఫ్‌టీ) అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌కు సూచించింది. ఈ ఏడాది మేలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్ నల్ల సూట్ ధరించి పోటీల్లో పాల్గోన్న సంగతి తెలిసిందే.
సెరెనా నల్ల సూట్‌పై అప్పట్లో క్రీడాకారులు, తదితరులు అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లందరికీ ఒకేలాంటి నిబంధనలు ఉండాలి... ఒక్కొక్కరికీ ఒకోలా కాదు అంటూ విమర్శలు కూడా చేశారు. దీనిపై తాజాగా
ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్(ఎఫ్‌ఎఫ్‌టీ) అధ్యక్షుడు బెర్నార్డ్ స్పందించాడు.
"ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో సెరెనా ధరించిన దుస్తులపై దుమారం రేగింది. దీంతో వచ్చే ఏడాది నుంచి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇలాంటి దుస్తులు వేసుకుని ఆడేందుకు అనుమతించడం లేదు. ఎలాంటి దుస్తులు ధరించాలన్న దానిపై ఇప్పటికే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా క్రీడాకారులు దుస్తులు ధరించాలి" అని తెలిపారు.
ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది జరగనున్న ఫ్రెంచ్ ఓపెన్ మరి కాస్త ఆలస్యంగా ప్రారంభంకానుందని బెర్నార్డ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో సెరెనా డ్రస్ గురించి మీడియా ఆమెని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. "బ్లాక్ పాంథర్ సినిమాను చూసి స్ఫూర్తి పొందాను. నేను పోరాట యోధురాలిని అని ఎప్పుడూ ఫీలవుతాను. అందుకే ఈ డ్రస్‌ని ధరించా" అని సెరెనా తనదైన శైలిలో స్పందించింది.
అయితే, సెరెనా విలియమ్స్ ఈ క్యాట్ సూట్ ధరించడం వెనుక పెద్ద కథే ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో సెరెనా విలియమ్స్ బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో ప్రాణాలతో పోరాడింది. సెరెనా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వేరే గదికి తరలించారు. ఒకరోజు సెరెనాకు ఊపిరాడక పోవడంతో నోటితో శ్వాస తీసుకుంటూ గదిలో నుంచి బయటికి వచ్చి సీటీ స్కాన్ తీయాలని నర్సుకి చెప్పిందంట.
దీంతో వెంటనే నర్సు తాను ఇచ్చిన నొప్పి మందు వల్ల అలా జరిగిందేమోనని భావించి అల్ట్రాసౌండ్ స్కాన్ తీస్తానని చెప్పి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంది. అయితే వెంటనే సెరెనా 'కడుపులో నొప్పి వల్ల కాదు.. నా శరీరంలో ఇంకేదో జరుగుతుంది సీటీ స్కానే తీయండి' అని మరోసారి నర్సును కోరింది. అయితే సెరెనా చెప్పిందేమీ వినిపించుకోకుండా వైద్యులు తొలుత అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి అందులో ఏమీ లేదని తేల్చారు.
ఆ తర్వాత సీటీ స్కాన్ నిర్వహించగా.. ఊపిరితిత్తుల్లో రక్తపు గడ్డలు ఉన్నట్లు తేలింది. అప్రమత్తమైన వైద్యులు వెంటనే ఆమెకు ఆపరేషన్ చేసిన ఆ రక్తపు గడ్డలను తొలగించేశారు. అలా బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో సెరెనా వైద్యపరమైన సమస్యలను ఎదుర్కొంది. దీని కారణంగానే ఈ తరహా సూట్ ధరించాల్సి వచ్చిందని మ్యాచ్ అనంతరం సెరెనా వెల్లడించింది.