
హైదరాబాద్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో భాగంగా జరిగిన అక్కాచెల్లెళ్ల మధ్య సింగిల్స్ పోరులో సెరెనా విలియమ్స్ విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా మూడో రౌండ్‌లో సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్‌లు తలపడ్డారు.
వీరిద్దరి మధ్య జరిగిన ఈ పోరు పూర్తిగా ఏకపక్షంగా ముగిసింది. చెల్లెలు సెరెనా విలియమ్స్ జోరు ముందు వీనస్ విలియమ్స్ తలొంచింది. విలియమ్స్ సిస్టర్స్ మధ్య పోటీ తారాస్థాయిలో ఉంటుందని ఊహించిన అభిమానులు నిరాశకే గురయ్యారు. ఈ మ్యాచ్‌లో సెరెనా విలియమ్స్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది.
మూడో రౌండ్‌లో వీనస్ విలియమ్స్ 16వ సీడ్‌గా బరిలోకి దిగిగా సెరెనా విలియమ్స్ 17వ సీడ్‌గా బరిలోకి దిగింది. తొలి సెట్ నుంచే అక్క వీనస్‌పై సెరెనా ఆధిపత్యం ప్రదర్శించింది. పవర్‌ఫుల్ సెర్వ్‌లు, కళ్లు చెదిరే రిటర్న్ షాట్లతో వీనస్‌పై ఒత్తిడి పెంచి తొలి సెట్‌ను 6-1తో కైవసం చేసుకుంది.
ఇక, రెండో సెట్‌లో సెరెనా విలియమ్స్ విజృభించింది. వీనస్‌కు అసలే మాత్రం అవకాశమివ్వకుండా తనదైన శైలిలో ఎటాకింగ్ షాట్లతో చెలరేగింది. ఎటువంటి అనవసర తప్పిదాలు చేయకుండా సునాయాసంగా 6-2తో రెండో సెట్‌ను సొంతం చేసుకుని మ్యాచ్‌ని కూడా సొంతం చేసుకుంది.
దీంతో సెరెనా విలియమ్స్ యుఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్ ఫైనల్ రౌండ్‌లో ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం ఈస్టోనియన్ స్టార్ కియా కనేపీతో తలపడనుంది. మోడ్రన్ డే టెన్నిస్‌లో విలియమ్స్ సిస్టర్స్ మధ్య వైరం ఈనాటిది కాదు. గత 20 ఏళ్లుగా వీరిద్దరూ అనేక గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో పోటీ పడుతూనే ఉన్నారు.
ప్రస్తుతం ముగిసిన యుఎస్ ఓపెన్ మ్యాచ్‌తో కలిపి ఈ ఇద్దరూ 30 సార్లు ప్రత్యర్ధులుగా పోటీ పడ్డారు. 15 సార్లు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో పోటీపడ్డారు. వీనస్‌పై సెరెనా పైచేయి సాధించింది. సెరెనా 18 మ్యాచ్‌లు నెగ్గిగా... వీనస్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. యుఎస్ ఓపెన్‌లో ఈ ఇద్దరూ 6 సార్లు ప్రత్యర్దులుగా తలపడగా 4 మ్యాచ్‌ల్లో సెరెనా, 2 మ్యాచ్‌ల్లో వీనస్ నెగ్గింది.