హైదరాబాద్: టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు షోయబ్ మాలిక్ గులాబీ పువ్వునిచ్చి ప్రపోజ్ చేసిన ఫోటో ఇంటర్నెట్లో చక్కెర్లు కొడుతోంది. షోయబ్ మాలిక్ తనకు గులాబీ పువ్వును ఇస్తున్న ఫోటోను సానియా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇది ఆకట్టుకునేలా ఉంది.

అందులో... షోయబ్ మాలిక్ మోకాళ్లపై నిలబడి గులాబీని అందిస్తున్నాడు. సానియా అతడిని చూస్తూ నవ్వుతూ ఉన్న ఈ ఫోటోకు 'ప్రపోజల్ ఆఫ్టర్ ప్రపోజల్' అని వ్యాఖ్యను కూడా సానియా జోడించింది. ఇప్పుడీ ఫోటో ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోంది.
కాగా, ఇటీవల ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా టాప్ 5 ర్యాంక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సానియా మీర్జాకు కెరీర్ ఉత్తమ ర్యాంక్ దక్కింది.
ఇటీవలి డబ్ల్యుటీఏ ర్యాంకింగ్స్ డబుల్స్ విభాగంలో సానియా ఒక ర్యాంక్ మెరుగుపర్చుకుని ఐదో స్థానంలో నిలిచింది. వింబుల్డన్‌లో సానియా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడీ రెండో రౌండ్‌లో ఓడిన సంగతి తెలిసిందే. సానియా-కారా జోడీకి 130 ర్యాంకింగ్ పాయింట్లు దక్కడంతో టాప్-5 చేరడం సులువైంది.