గత కొన్ని నెలలుగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల అనంతరం ఆమె చేసిన ప్రతి పోస్ట్ నెట్టింటిని షేక్ చేస్తోంది. సానియా ఏ పోస్ట్ పెట్టినా, ఎక్కడికి వెళ్లినా క్రేజీ న్యూస్‌గా మారుతోంది. అయితే ఇటీవల సానియా హజ్ యాత్రకు వెళ్తూ చేసిన పోస్ట్‌ను కొందరు ద్వందార్థం చేసుకున్నారు.
ఈ యాత్రతో తన జీవితంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నానని, బలమైన వ్యక్తిగా తిరిగొస్తానని సానియా మీర్జా పేర్కొన్నారు. అయితే దీనిని కొందరు నెటిజన్లు భిన్నంగా అర్థం చేసుకున్నారు. రెండో పెళ్లికి సానియా మీర్జా పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చర్చ మొదలుపెట్టారు. ఈ క్రమంలో సానియా మీర్జాను టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి పెళ్లి చేసుకోనున్నట్లు పుకార్లు మరోసారి మొదలయ్యాయి.

సానియా మీర్జా-మహ్మద్ షమికి పెళ్లి అంటూ వార్తలు రావడం ఇది కొత్తమీ కాదు. గతంలోనూ వచ్చాయి. దీనిపై షమి కూడా స్పందించాడు. తన జీవితంలో విన్న అతి పెద్ద రూమర్ ఇదే అంటూ పుకార్లను కొట్టిపారేశాడు. అయితే తాజాగా ఈ విషయంపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, షమీని సానియా ఇప్పటి వరకు అసలు కలవలేదని స్పష్టం చేశారు.
సానియా మీర్జా- షోయబ్ మాలిక్ 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికీ షోయబ్‌కు అది రెండో వివాహం. తన తొలి భార్య అయేషా సిద్ధిఖితో విడాకుల అనంతరం సానియాను షోయబ్ పెళ్లి చేసుకున్నాడు. అయితే కొద్ది నెలల కిందటే ఈ జంట విడిపోయారు. కాగా, పాకిస్థాన్‌కు చెందని నటి సనా జావేద్‌ను షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. 28 ఏళ్ల సనా జావేద్‌కు ఇది రెండో వివాహం. మరోవైపు మహ్మద్ షమి తన మాజీ భార్య హసిన్ జహాన్‌తో మనస్పర్థలు రావడంతో కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటున్నాడు. షమి-హసిన్ విడాకుల కేసు న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.