ఇండోర్: తాను కూడా ఆత్మకథ రాస్తున్నానని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రకటించింది. ఇప్పటికే 26 అధ్యాయాలు పూర్తి చేశానని, అయితే ఆ పుస్తకాన్ని ఎప్పుడు విడుదల చేయాలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని చెప్పింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న తరుణంలోనే సానియా తన ఆత్మకథ గురించి ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
"ఆత్మకథ రాయడం ప్రారంభించా. జీవితం సాగేకొద్దీ కొత్త అధ్యాయాలు జోడించాల్సి వస్తోంది. దీన్ని ఎప్పుడు పూర్తి చేయాలో ఎప్పుడు విడుదల చేయాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నా జీవితం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. వాటిలో కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు ఉన్నాయు. అందుకే ఆత్మకథ రాయాలని నిర్ణయించుకున్నా" అని చెప్పింది.

ఆయా అంశాల్లో తన దృక్కోణం ఏమిటో ఈ పుస్తకంతో ప్రజలు తెలుసుకుంటారని శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సానియా చెప్పింది. ఇక సచిన్ ఆటోబయోగ్రఫీపై వచ్చిన విమర్శలపై స్పందించిన ఆమె తాను మాస్టర్‌కే మద్దతిస్తున్నానని చెప్పింది. అమ్మకాలు పెంచుకునేందుకు పుస్తకంలో తాము విమర్శలు జొప్పించలేమని, సచిన్ అలాంటి పని ఎప్పటికీ చేయలేమని చెప్పింది.
ఐదేళ్లలో తనకు మూడు శస్త్ర చికిత్సలు జరిగాయని, అందుకే సింగిల్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని సానియా తెలిపింది. ఇక తనకు సినిమాల్లో నటించాలనే ఆలోచనలు లేదని సానియా మరోసారి స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆహారం చాలా బాగుంటుందని సానియా కితాబిచ్చింది.
తరచుగా ఇక్కడికి రాలేకపోవడంతో ఢిల్లీ ఫుడ్‌ను మిస్సవుతున్నానని తెలిపింది. నగరంలోని ప్రముఖ హోటళ్లలో భోజనం చేయడమంటే తనకు చాలా ఇష్టమని సానియా చెప్పింది. హైదరాబాదులోని టెన్నిస్ అకడామీ ద్వారా తాను ఆటకు సేవలు అందిస్తానని సానియా చెప్పింది. సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.