హైదరాబాద్: తెలంగాణలోని లక్నవరం చెరువు వద్ద హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా సందడి చేయనున్నారు. టూరిజం ప్రమోషన్ కార్యక్రమాల్లో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా స్టార్ ట్రాక్షన్ కానున్నారు. తెలంగాణ టూరిజం శాఖ పర్యాటకులను ఆకర్శించేందుకు ప్రణాళికలను రూపొందిస్తోంది. లక్నవరం చెరువు ప్రాంతం ప్రకృతి అందాలతో కళకళలాడుతుంది.
తెలంగాణలో ఉన్న అడవుల అందాలు, నదులు, సెలయేళ్లు, అంతర్జాతీయ నగరంగా మారుతున్న హైదరాబాద్ విశేషాలను ప్రపంచానికి తెలియజేసేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే వరంగల్ జిల్లాలోని లక్నవరం చెరువుకు అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాను రప్పించి పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకమైన ప్రచారకార్యక్రమాన్ని రూపొందించాలని టూరిజం శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

2015 సంవత్సరంలో సానియా మీర్జా అంతర్జాతీయ క్రీడాపోటీల్లో పలు పతకాలు సాధించారు. మహిళల టెన్నిస్ డబుల్స్‌లో క్రీడల్లో స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలిసి వింబుల్డన్ ట్రోఫిని కూడా గెలుచుకున్నారు. దానికి ముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానియామీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సానియామీర్జాను వరంగల్ జిల్లాలో ఎంతో పేరున్న పర్యాటక చెరువైన లక్నవరం తీసుకురావాలని పర్యాటకశాఖ అధికారులు నిర్ణయించారు.
లక్నవరం చెరువువద్ద ప్రస్తుతం కొత్త కాటేజీలను నిర్మిస్తున్నారు. ఆధునికంగా నిర్మిస్తున్న కాటేజీలకు ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించింది. జనవరి మొదటివారంలో కాటేజీలను ప్రారంభించనున్నారు. అనంతరం సానియా మీర్జాను ఇక్కడికి తీసుకువచ్చి ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని భావిస్తున్నారు.
తద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్నవరం చెరువుకు గుర్తింపు వస్తుందని, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అయిన సానియాద్వారా మిగిలిన పర్యాటక ప్రదేశాలను కూడా ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆస్కారం ఉంటుందని టూరిజం శాఖ అధికారులు భావిస్తున్నారు.