న్యూయార్క్: భారత క్రీడా రంగంలో దూసుకుపోతున్న విరాట్ కోహ్లీ, సానియా మిర్జా, సైనా నెహ్వాల్‌లు ఫోర్బ్స్ ఆసియా 'ప్రామిసింగ్ యంగ్ లీడర్స్ అండ్ గేమ్ ఛేంజర్స్' జాబితాలో నిలిచారు. ఇటీవల కాలంలో క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్, టెన్నిస్‌లో సానియా మిర్జా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
ఆసియాలో 30 ఏళ్లలోపు అత్యంత ప్రతిభగల క్రీడాకారులను 300 మందిని ఫోర్బ్స్ ఎంపిక చేసింది. ఈ జాబితాలో 56 మంది భారతీయులకు చోటు దక్కింది. వారిలో విరాట్ కోహ్లీ, సానియా మిర్జా, సైనా నెహ్వాల్, శ్రద్ధాకపూర్‌లు ముందు వరుసలో ఉన్నారు.

ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాపై కోహ్లీ ఆధ్వర్యంలోని భారత జట్టు టీ20 సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిందని, దీంతో పాటు భారత్‌లో కోహ్లీ అత్యధికంగా ఏడాదికి 11.3 మిలియన్ డాలర్లు ఆర్జించారని ఫోర్బ్స్ పేర్కొంది. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ టెన్నిస్ ప్రపంచంలోకి 2003లో అడుగుపెట్టిన సానియా మిర్జా విజయవంతమైన క్రీడాకారిణిగా కొనసాగుతున్నారని పేర్కొంది.
ప్రస్తుతం సానియా మిర్జా-మార్జిన్ హింగిస్ జోడీ మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న విషయాన్ని సైతం గుర్తు చేసింది. ఇక 25 ఏళ్ల సైనా నెహ్వాల్‌ను రోల్ మోడల్‌గా చిత్రీకరించడంతో పాటు భారత బ్యాడ్మింటన్ క్వీన్‌గా ఫోర్బ్స్ ప్రశంసించింది.