న్యూఢిల్లీ: భారత టెన్నిస్ తార సానియా మీర్జా పైన కొత్త వివాదం నడిచింది. దీనిపై ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ) వివరణ ఇవ్వడంతో వివాదం ముగిసిపోయినట్లుగా సానియా అభిప్రాయపడుతున్నారు. ఇటీవల రియో ఒలింపిక్స్‌లో టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తృటిలో సిల్వర్ మెడల్ దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయింది.
సానియా, బోపన్నల జోడి సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన వీనస్ విలియమ్స్, రాజీవ్ రామ్‌ల చేతిలో ఓడిపోయింది. అయితే తాజాగా రష్యాకు చెందిన 'ఫ్యాన్సీ బీర్స్' అనే ఒక హ్యాకర్స్ గ్రూప్ అమెరికన్ క్రీడాకారుల పైన సంచలన ఆరోపణలు చేసింది.
రియోలో పలు అమెరికన్ అథ్లెట్లు నిషేధిత ఉత్ప్రేరకాలను తీసుకున్నట్టు గుర్తించినట్లు తెలిపింది. ఆ క్రీడాకారుల పేర్లలో వీనస్ విలియమ్స్ ఉంది. ఈమె నిజంగానే నిషిద్ద ఉత్ప్రేరకాలను తీసుకుందని రుజువైతే తర్వాత స్థానంలో ఉన్న సానియా జోడీకి రజిత పతకం వచ్చే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా సానియా తల్లి నసీమా ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్‌ను కోరినట్టు వార్తలు వచ్చాయి. అందుకు బదులుగా కొన్ని వార్తల ఆధారంగా తాము ఎవరినీ ప్రశ్నించలేమని, ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ సమాధానమిచ్చినట్టుగా కూడా వార్తలొచ్చాయి.
కానీ ఈ వార్తలను సానియా కొట్టి పడేశారు. అందుకు తగిన ఆధారాన్ని కూడా ఆమె సోషల్ మీడియాలో ఉంచారు. దీంతోనైనా తమపై వచ్చిన ఆరోపణలు ఆగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. వివాదాస్పదమైన వార్తతో సమానంగా ఈ వార్త కూడా హైలెట్ కావాలని ఆమె కోరారు.
ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ అధికారికంగా విడుదల చేసిన ఒక మీడియా ప్రకటనను ఆమె పోస్ట్ చేశారు. అందులో సానియా నుంచి లేదా ఆమె తల్లి నుంచి కానీ తమకు ప్రపంచ యాంటీ డోపింగ్ అసోసియేషన్‌కు సంబంధించి విజ్ఞాపన రాలేదని వెల్లడించారు.