హైదరాబాద్: చైనాలోని బీజింగ్‌లో జరుగుతున్న చైనా ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి సానియా-షూయ్ పెంగ్‌ల జోడి నిష్క్రమించింది. సెమీ ఫైనల్స్‌లో భాగంగా జరిగిన సూపర్ టై బ్రేక్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్, తైవాన్‌కి చెందిన చాన్ యంగ్ జాన్‌ల జోడిపై సానియా జోడి ఓడిపోయింది.
శనివారం జరిగిన పోరులో 6-2, 1-6, 5-10 తేడాతో సానియా జోడీ ఓటమి పాలైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గత వారం వుహాన్‌లో జరిగిన ఓపెన్ సిరీస్ సెమీ ఫైనల్స్‌లో కూడా ఈ జోడీ చేతిలోనే సానియా జోడీ ఓటమి పాలైంది.

ఇక చైనా ఓపెన్ ఫైనల్స్‌లో మార్టినా హింగిస్- చాన్‌ల జోడి, తిమియా బాబోస్-ఆండ్రియా జోడీతో పోటీపడనుంది. ఇదిలా ఉంటే మహిళల సింగిల్స్‌లో రొమేనియాకు చెందిన సిమోనా హలెప్ ఫైనల్స్‌కి చేరుకుంది. చైనా ఓపెన్‌ను గనుక హలెప్ నెగ్గితే ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకుంటుంది.
కాగా, శుక్రవారం బీజింగ్‌లో జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా-షుయె పెంగ్‌ల జోడీ 4-6, 6-2, 10-7తో 'సూపర్ టైబ్రేక్'లో బార్బరా స్ట్రికోవా-కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై విజయం సాధించి సెమీ పైనల్స్‌కు చేరిన సంగతి తెలిసిందే.