హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, టెన్నిస్ తార సానియా మీర్జా ఇటీవల వరుస విజయాలతో దూసుకు పోతున్న విషయం తెలిసిందే. అయితే, ఆమెకు అనుకోని విధంగా హాలీవుడ్ అవకాశం వచ్చినట్లుగా చెబుతున్నారు. అనుకోకుండా వెతుక్కూంటూ వచ్చిన అవకాశం పైన ఆమె స్పందించారని అంటున్నారు.
హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెయిగ్ ప్రముఖ పాత్రలో తెరకెక్కుతున్న 24వ బాండ్ సినిమాలో క్రీడాకారిణి పాత్రకు సానియా మీర్జా ఎంపికయ్యారని చెబుతున్నారు. తాను బాండింగుతో ముందుకు వెళ్తున్నానని, ఈ సంతోషాన్ని అందరితో పంచుకోకుండా ఉండలేకపోతున్నానని తెలిపారు. ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.
ఇప్పుడు ఉన్నట్లే ముందుముందు కూడా అందరి ఆదరణ, ఆశీస్సులు కావాలని ఆమె కోరారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికవడం, యూఎస్ ఓపెన్ ఉమెన్స్ డబుల్స్ టైటిల్, సింగపూర్ డబ్ల్యుటీఏలో గెలవడంతో సానియా మీర్జా జీవితంలో ఈ ఏడాది బాగుంది.

గతంలోను పలువురు క్రీడాకారులు సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. నితిన్ హీరోగా వచ్చిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించారు. పరుగుల రాణీ అశ్వనీ నాచప్ప తన జీవిత గాథ ఆధారంగా తీసిన సినిమాలో కథానాయిక పాత్ర పోషించారు. హాలీవుడ్‌లో సానియా మీర్జాకు అవకాశం రావడం గమనార్హం.
దీని పైన ఇంకోరకమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆమె బాండ్ చిత్రంలో నటించడం లేదని అంటున్నారు. సానియా బాండ్ సినిమాలో నటించడం లేదని, కానీ జేమ్స్ బాండ్ గురించిన ఓ టీవీ ప్రోగ్రామ్‌ను మాత్రమే ఆమె ప్రమోట్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీని పైన సానియా తల్లిదండ్రులు కూడా ఆంగ్ల మీడియాతో స్పందించారని తెలుస్తోంది. అయితే, ఆమె ట్వీట్ సినిమా గురించా లేక టీవి ప్రోగ్రాం ప్రమోషన్ గురించా తెలియాల్సి ఉంది.