For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రికార్డు: టెన్సిస్ డబుల్స్‌లో హైదరాబాదీ సానియా నెంబర్ వన్

By Pratap

చార్లెస్టన్: టెన్నిస్ డబుల్స్‌లో సానియాకు నంబర్ వన్ ర్యాంక్ దక్కింది. దాంతో ఈ ఘనత సాధించిన భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. హింగిస్‌తో కలిసి ఫ్యామిలీ సర్కిల్ కప్ సొంతం చేసుకోవడంతో సానియా నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ప్రపంచ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో అత్యున్నత స్థానానికి చేరుకుంది.

మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో జత కట్టి మొన్న ఇండియన్ వెల్స్, నిన్న మియామీ ఓపెన్, ఇప్పుడు ఫ్యామిలీ సర్కిల్ కప్‌లనుసొంతం చేసుకుని డబుల్స్‌లో అగ్రస్థానాన్ని అందుకుంది. ఈ ఘనత వహించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు పురుషుల డబుల్స్‌లో భారత్ నుంచి వెటరన్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతి నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించారు.

2007లో అత్యుత్తమంగా సింగిల్స్‌లో 27వ ర్యాంకును అందుకున్న సానియా ఆ తర్వాత ఏకంగా 217వ ర్యాంకుకు పడిపోయింది. ఆ తర్వాత గాయంతో ఫామ్ కోల్పోయింది. నాలుగు శస్త్రచికిత్సలు చేయించుకుంది. దీంతో సానియా ఇక రాకెట్ పట్టడం కష్టమేనన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి. ఈ దశలో సానియాకు కోచింగ్ ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకురాలేదు. అయినా కూడా ఏమాత్రం అధైర్యపడకుండా మళ్లీ రాకెట్‌పట్టింది. సింగిల్స్‌లో రాణించడం కష్టమనుకుంది. డబుల్స్‌పైనే దృష్టి కేంద్రీకరించింది. 2013లో అమెరికా ప్లేయర్ బెతానీ మాటెక్‌తో కలిసి దుబాయ్ టైటిల్ విజయంతో మొదలైన సానియా ప్రస్థానం ఏకంగా గ్రాండ్‌స్లామ్ సాధించే దాకా సాగింది.

ఇప్పటివరకు సానియా 26 డబ్ల్యూటీఏ టైటిళ్లు సాధించింది. వీటిలో అత్యధికంగా గత మూడు, నాలుగేండ్లలో నెగ్గినవే. 2009లో మహేశ్ భూపతి జతగా ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌తో తొలి గ్రాండ్‌స్లామ్ ఖాతాలో వేసుకున్న సానియా, 2012లో భూపతితోనే కలిసి ఫ్రెంచ్ ఓపెన్ కూడా నెగ్గింది. నిరుడు బ్రెజిల్ ఆటగాడు బ్రూనో సోరెస్ జోడీగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. వింబుల్డన్ కూడా నెగ్గితే డబుల్స్‌లో కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించిన అరుదైన ఘనతను సానియా సొంతం చేసుకుంటుంది.

Sania Mirza seals historic world no 1 rank with Charleston title

నిరుడు ఆఖరులో వరల్డ్ టూర్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ నెగ్గి కారా బ్లాక్ (దక్షిణాఫ్రికా)తో బంధానికి ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ ఏడాది ఆరంభంలో సూ వీ (చైనీస్ తైపీ)తో జతకట్టినా అంతగా విజయాలు దక్కకపోవడంతో ఆమెతో విడిపోయింది. ఈ పరిస్థితుల్లో స్విట్జర్లాండ్ వెటరన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్‌ను భాగస్వామిగా ఎంచుకోవడం సానియా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆమెతో కలిసి ఆడిన తొలి ప్రయత్నంలోనే టైటిల్ నెగ్గడం విశేషం. హింగిస్ జతగా ఇండియన్ వెల్స్ ఓపెన్ నెగ్గిన సానియా, ఆ వెంటనే జరిగిన మియామీ ఈవెంట్‌లోనూ చాంపియన్‌గా నిలిచి తమ జోడీకి తిరుగులేదని నిరూపించింది.

హింగిస్‌తోనే కలిసి ఫ్యామిలీ సర్కిల్‌కప్‌లో టైటిల్ కొట్టి నంబర్‌వన్‌గా నిలవడమే తన లక్ష్యమని మియామీ ఓపెన్ గెలుపు అనంతరం సానియా అప్పుడు చెప్పింది. చెప్పినట్లే ఈ విజయంతో నంబర్‌వన్ స్వప్నాన్ని సాకారం చేసుకుంది.

డబ్ల్యూటీఏ ఫ్యామిలీ సర్కిల్ కప్‌ను గెలుచుకుని సత్తా చాటింది. ఈ విజయంతో తన ఖాతాలో 470 పాయింట్లు చేర్చుకుని మొత్తంగా 7965 పాయింట్లతో మహిళల డబుల్స్‌లో వ్యక్తిగతంగా నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కాసీ డెలాక్వా (ఆస్ట్రేలియా), డార్జియా జురాక్ (క్రొయేషియా) జోడీపై 6-0, 6-4తో వరుస సెట్లలో గెలుపొందింది.

సానియా స్పందన...

నంబర్‌వన్ ర్యాంక్ సాధించడం ప్రతీ ఒక్కరి కల. ఈ ఘనత సాధించడంలో హింగిస్ నుంచి లభించిన సహకారం మరొకరి నుంచి వస్తుందని అనుకోను. ఇక్కడికి వచ్చాక నా దృష్టంతా నం.1పైనే పెట్టాను. ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో హింగిస్ అందించిన తోడ్పా టు మరువలేనిది. ఈ విజయంతో నం.1 జోడీగానూ అవతరించాం. మరిన్ని విజయాలు సాధిస్తామన్న నమ్మకంతో ఉన్నాం.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+