
న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య ప్రతిష్టాత్మక పోరుకు రంగం సిద్ధమైంది. ఎప్పుడు తలపడ్డా క్రికెట్ ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించే దాయాది జట్లు మరోసారి క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేయడానికి సిద్ధమయ్యాయి. ఏ టోర్నీ అనేది కాదు.. భారత్-పాక్ మ్యాచ్ ఉన్నప్పుడల్లా భారత్ గెలించిందా లేదా అన్నదే యావత్ భారతీయ క్రికెట్ అభిమానుల లెక్క. ఆసియాకప్ నేపథ్యంలో ఇరు జట్లు బుధవారం తలపడనున్నాయి.
ఈ సందర్భంగా ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ట్వీట్ చేశారు. కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిదని పేర్కొన్నారు. ఈమె పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'మీరు ఏ జట్టుకు మద్దతివ్వనున్నారు' అని ఓ నెటిజన్ ప్రశ్నించగా ఈమె ఇందుకు సమాధానంగా మీడియాకు దూరంగా ఉందామనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సానియా బుధవారం ట్వీట్ చేశారు.
'మ్యాచ్ ప్రారంభం కావడానికి 24 గంటలు కూడా లేదు. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. లేకపోతే అడ్డమైన చెత్తవాగుడు వినాల్సి వస్తది. ఇదంతా వింటూ ఉంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా జబ్బు పడాల్సిందే. మరి ప్రెగ్నెంట్ అయిన నా పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. కానీ మీరంతా ఒకటి గుర్తుంచుకొండి. ఇది కేవలం క్రికెట్ మ్యాచ్ మాత్రమే' అంటూ ట్వీట్ చేశారు.' అంటూ ట్వీట్ చేశారు.
భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్ బుధవారం సాయంత్రం 5గంటలకు దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది. ఆసియా కప్‌లో టీమిండియాకు ఇది రెండో మ్యాచ్ కాగా, మొదటి మ్యాచ్‌ను స్వల్ప వ్యవధితో 26 పరుగుల తేడాతో హాంకాంగ్‌పై గెలిచింది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సూపర్ ఫోర్‌కు వెళ్లిపోతుంది.