
హైటెక్ సిటీలో 22 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైన నేపథ్యంలో అవాంఛనీయమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి మహిళా టెక్కీలకు ధైర్యం నూరిపోస్తూ, వారికి కొన్ని సూచనలు చేయడానికి పోలీసులు ఓ లఘు చిత్రాన్ని నిర్మించాలని అనుకుంటున్నట్లు సమాచారం.
సైబరాబాద్ పోలీసుసులు కొన్ని ఐటి కంపెనీల సహకారంతో లఘు చిత్రం తీయాలని ప్రణాళిక వేసుకున్నారు. ఈ చిత్రంలో కొంత మంది టాలీవుడ్ తారలు కూడా నటించే అవకాశాలున్నాయి. ఎవరైనా తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పుడు, తమపై దాడికి పూనుకున్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదనేది ఆ లఘు చిత్రం ద్వారా వివరించాలని పోలీసులు భావిస్తున్నారట.
ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఆ చిత్రంలో వివరిస్తారు. ఈ చిత్రాన్ని సినిమా హాళ్లలో, ఐటి కంపెనీల్లో ప్రదర్శించడమే కాకుడా మీడియాలో కూడా ప్రదర్శించే ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణం ప్రారంభమైనట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.