హైదరాబాద్: రూ. 75వేల మేకప్ కిట్, చార్టెడ్ ప్లైట్ బుక్ చేయడం లాంటి గొంతెమ్మ కోరికలు కోరడం వల్లనే ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జాను మధ్య ప్రదేశ్ ప్రభుత్వం యాన్యువల్ స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమానికి ఆహ్వానించలేదని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన యాన్యువల్ స్పోర్ట్స్ అవార్డ్స్ కార్యక్రమానికి సానియా మిర్జాను ముఖ్యఅతిథిగా పిలవాలని మధ్యప్రదేశ్ క్రీడా మంత్రిత్వ శాఖ, యూత్ వెల్ఫేర్ అధికారులు తొలుత అనుకున్నారు. ఇందుకోసం సానియా మిర్జా అనుమతి కోసం అధికారులు ఆమెను సంప్రదించారు.
అయితే సానియా మిర్జా ముఖ్య అతిథిగా రావాలంటే రూ.75,000 విలువ చేసే ఒక మేకప్ కిట్ ఇవ్వాలని, ఆమె భోపాల్ ప్రయాణానికి ఒక చార్టెడ్ ఫ్లైట్‌ను వినియోగించాలని, సహాయకుల కోసం బిజినెస్ క్లాస్‌లో ఐదు టిక్కెట్లు బుక్ చేయాలని సానియా పర్సనల్ అసిస్టెంట్ డిమాండ్ చేసిందని మధ్యప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి యశోదర రాజే ఆరోపించారు.

సానియా మిర్జా డిమాండ్లకు మంత్రిత్వ శాఖ అంగీకరించ పోవడంతో ముఖ్య అతిథిగా వెళ్లేందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో, సానియా మిర్జా స్థానంలో ముఖ్య అతిథిగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ హాజరయ్యారు. సానియా కారణంగానే గత నవంబర్ 28వ తేదీన జరగాల్సిన కార్యక్రమం డిసెంబర్ 1వ తేదీన జరిగిందని అధికారులు తెలిపారు.
అయితే సానియా కార్యక్రమానికి హాజరైతే ఫీజుగా ఎంత మొత్తం తీసుకుంటారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి యశోదర రాజే మాట్లాడుతూ, టెన్నిస్ క్రీడా కారిణిగా సానియా మిర్జాను గౌరవిస్తామని, కానీ ఆమె గొంతెమ్మ కోరికలు తీర్చడం కష్టమని చెప్పారు. కాగా, ఈ వివాదంపై టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఇంకా స్పందించలేదు.