కరాచీ: ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్‌తో చరిత్ర సృష్టించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన సొంత దేశం భారత్‌కే కాదు, అత్తగారిల్లు పాకిస్థాన్‌కూ గర్వకారణమంటున్నాడు ఆమె భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్. స్విస్ వెటరన్ స్టార్ హింగిస్‌తో కలిసి సానియా.. ఫ్యామిలీ సర్కిల్ కప్‌లో విజేతగా నిలిచి వరల్డ్‌నంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మాట్లాడిన మాలిక్, సానియా ప్రదర్శనను చూసి తాను చాలా గర్వపడుతున్నాని తెలిపాడు. ఆమె భారతదేశానికి ప్రాతినిథ్యం వస్తున్నప్పటికీ.. తన భార్య కావడం వల్ల ఇది పాకిస్థాన్ గౌరవానికి కూడా సంబంధించిన అంశమేనని చెప్పాడు.

అంతర్జాతీయ వేదికలపై అద్భుతరీతిలో రాణిస్తూ సానియా సాధిస్తున్న విజయాలు భారత్, పాకిస్థాన్ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి అని షోయబ్ పేర్కొన్నాడు. సానియాతో పెళ్లికి ముందు నుంచి తనకు టెన్నిస్ అంటే ఇష్టమని చెప్పిన షోయబ్.. ఇప్పుడు ప్రాణంగా మారిందని తెలిపాడు. తాను ఆమెను చాలా మిస్ అవుతున్నాని, అందుకోసమే ఆమె ఆడుతున్న ప్రతీ మ్యాచును ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తానని చెప్పాడు.
ఆమె గెలుపును తన కుటుంబసభ్యులతో పంచుకుంటానని తెలిపాడు. నెంబర్ వన్ ర్యాంకు సాధించిన తర్వాత సానియా, సానియా కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపానని చెప్పాడు. సానియా విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నాడు.