
దుబాయ్: బాబు పుట్టడంతో రెండేళ్లు ఆటకి దూరంగా ఉన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గత జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీతో రీఎంట్రీ ఘనంగా ఇచ్చింది. రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఏకంగా టైటిల్ సాధించింది. నదియా కిచెనోక్ (ఉక్రెయిన్)తో కలిసి బరిలోకి దిగిన సానియా.. ఫైనల్లో పోరాడి టైటిల్ గెలిచింది.
హోబర్ట్ టోర్నీ అనంతరం ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో పోటీపడిన సానియా మీర్జా ఆరంభంలోనే నిష్క్రమించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా కాలికి గాయం కావడంతో మ్యాచ్ మధ్యలోనే తప్పుకొంది. రెండు వారాల్లోనే మళ్లీ ఫిట్‌నెస్ సాధించింది. గాయం నుంచి వేగంగా కోలుకున్న సానియా.. బుధవారం నుంచి ప్రారంభం కానున్న దుబాయ్ ఓపెన్‌లో బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించింది. బుధవారం జరిగే తొలి రౌండ్‌లో రష్యాకు చెందిన కుద్రయోత్సోవా-కేటరినా శ్రీబోట్నిక్ జోడీతో సానియా-కరోలినా గార్షియా (ఫ్రాన్స్) జంట తలపడనుంది.
ఆస్ట్రేలియా ఓపెన్ తొలి రౌండ్ నుండే గాయంతో వెనుదిరగడం ఎంతో బాధించిందని సానియా పేర్కొంది. తిరిగి ఫిట్‌నెస్ సాధించడంలో డాక్టర్ హయత్ ఖాన్ ఎంతో సహాయం చేసారని ఆమె చెప్పుకొచ్చింది. 'ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం బాధించింది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇలా జరగడం బాధే. తిరిగి ఫిట్‌నెస్ సాధించడంలో డాక్టర్ హయత్ ఖాన్ ఎంతో సహాయం చేసారు. ఇప్పటికే నేను ప్రాక్టీస్ మొదలెట్టాను. దుబాయ్ ఓపెన్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తా' అని సానియా తెలిపింది.
2017 అక్టోబర్‌లో చైనా ఓపెన్ ఆడిన సానియా.. ఆ తర్వాత గాయపడటంతో ఆటకు విరామం ఇచ్చింది. ఇక 2018 అక్టోబర్‌లో మగబిడ్డ ఇజాన్‌కు జన్మనిచ్చిన సానియా 2019 మొత్తం ఆటకు దూరంగా ఉంది. 2020లో హోబర్ట్ ఓపెన్ టైటిల్‌తో సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో గాయపడినా.. వేగంగా పుంజుకుని మళ్లీ రాకెట్ పట్టింది.