న్యూయార్క్: ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తన అక్క, మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్ పోరులో ఆమె 6-2, 1-6, 6-3 తేడాతో విజయం సాధించింది.
ప్రస్తుతం నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లలోనూ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న సెరెనా యుఎస్ ఓపెన్‌ను గెల్చుకుంటే క్యాలెండర్ శ్లామ్‌ను నమోదు చేస్తుంది. 1988లో స్టెఫిగ్రాఫ్ తర్వాత ఒకే క్యాలండర్ ఇయర్‌లో నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను ఇప్పటి వరకూ ఎవరూ సొంతం చేసుకోలేకపోయారు. ఆ అరుదైన రికార్డును సాధించేందుకు సెరెనా ఇప్పుడు రెండు మ్యాచ్‌లో దూరంలో ఉంది.

సెమీ ఫైనల్‌లో ఆమె ప్రపంచ 43వ ర్యాంకర్ రాబర్టా విన్సీని ఢీ కొంటుంది. మరో క్వార్టర్ ఫైనల్‌లో విన్సీ 6-3, 5-7, 6-4 స్కోరుతో క్రిస్టినా మ్లడెన్కొవాపై గెలిచి, సెమీస్‌లోకి అడుగుపెట్టింది. కెరీర్‌లో ఇప్పటి వరకూ 21 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను అందుకున్న సెరెనా ఈసారి కూడా యుఎస్ ఓపెన్‌ను గెల్చుకుంటే సెఫీ గ్రాఫ్ రికార్డును సమం చేస్తుంది.
అత్యధిక గ్రాండ్ శ్లామ్ సింగిల్స్ టైటిళ్లు సాధించిన క్రీడారిణుల జాబితాలో మార్గరెట్ కోర్టు 24 విజయాలతో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. స్టెఫిగ్రాఫ్ 22 టైటిళ్లతో రెండో స్థానంలో నిలవగా, మరోసారి సొంత గడ్డపై విజేతగా నిలవడం ద్వారా ఆమెతో కలిసి సంయుక్తంటగా రెండో స్థానాన్ని పంచుకోవడానికి సెరెనా సిద్ధమవుతోంది.
2011 ఫైనల్ తర్వాత యుఎస్ ఓపెన్‌లో సెరెనా ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌ని కూడా కోల్పోకపోవడం గమనార్హం. ఇదే దూకుడును కొనసాగిస్తే, క్యాలెండర్ శ్లామ్ ఫీట్‌ను ఆమె అందుకోవడం ఖాయం.
వీనస్, సెరెనా విలియమ్స్ మధ్య మొత్తం 27 మ్యాచ్‌లు జరిగాయి. వీనస్ 11 మ్యాచ్‌లు గెలిచింది. అక్కపై సెరెనాకు ఇది 16వ విజయం. గ్రాండ్ శ్లామ్ టోర్నీలో 9వ సారి వీనస్‌ను ఢీకొన్న సెరెనాకు ఇది కేవలం మూడో విజయం కావడం గమనార్హం.
సెమీస్‌కు సానియా జోడీ

మహిళల డబుల్స్ విభాగంలో భారత స్టార్ సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ సెమీ ఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్స్‌లో వీరు 7-6, 6-1 తేడాతో యుంగ్ జన్ చాన్, హాన్ చింగ్ చాన్ జోడీని ఓడించారు.
ఫైనల్‌లో స్థానానికి వీరు సారా ఎరానీ, ఫ్లావియా పెనెట్టా జోడీని ఢీ కొంటారు. మరో క్వార్టర్ ఫైనల్‌లో ఎరానీ, పెనెట్టా జోడీ 6-0, 5-7, 6-2 స్కోరుతో ఆండ్రెజా క్లెపాక్, లారా అరుబరెనా జోడీపై విజయం సాధించింది.