లండన్: ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకెళ్లిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-స్విస్ స్టార్ మార్టీనా హింగీస్ జోడి మరో ఘనత సాధించింది. ఈ ఏటి ప్రపంచ ఛాంపియన్ జోడిగా వీరు ఎంపికయ్యారు.
ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ మంగళవారం ప్రకటించిన ఛాంపియన్ జాబితా-2015 మహిళల డబుల్స్ విభాగంలో సానియా-హింగిస్ జోడి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. 15 ఏళ్ల తర్వాత మార్టీనా హెంగీస్ ఐటిఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌గా ఎంపికైంది. హెంగీస్ 2000ల సంవత్సరంలో సింగీల్స్ టైటిల్స్ గెల్చుకుని ఛాంపియన్‌గా ఎంపికైంది.
భారత టెన్నిస్ స్టార్ సానియామీర్జా ఈ ఏడాది మార్చిలో స్విస్ క్రీడాకారిణి మార్టినా హింగీస్‌తో జోడి కట్టింది. అప్పటి నుంచి ఈ జంట వెనుదిరిగి చూడలేదు. ఈ ఏడాది తొమ్మిది టైటిల్స్ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఇందులో రెండు గ్రాండ్‌స్లామ్‌లు కూడా ఉన్నాయి. ఏడాది ప్రారంభంలోనే వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గెలుచుకున్న ఈ జోడీ.. తర్వాత జరిగిన మరో ఏడు టోర్నమెంట్లలోనూ విజేతలుగా నిలిచారు.
'ఐటిఎఫ్ నుంచి ఈ అవార్డు లభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఏడాది నాకు, మార్టీనాకు ఎంతో గొప్పది. మేమిద్దరం కలిసి సాధించిన దానికి దక్కిన గౌరవంగా భావిస్తాను. నాకు మద్దతుగా నిలిచి, నన్ను ప్రోత్సహించిన వారందరికీ నా కృతజ్ఞతలు. నా విజయాలు భారతదేశంలోని ఇతర యువతులకు స్ఫూర్తినిస్తాయని ఆశిస్తున్నా' అని సానియా మీర్జా పేర్కొంది.