గ్వాంగ్‌జూ: ఈ ఏడాది అత్యద్భుతమైన ఫామ్‌లో ఉన్న సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ మరో టైటిల్‌ను సొంతం చేసుకుంది. గ్యాంగ్‌జూ డబ్ల్యుటిఎ టెన్నిస్ ఫైనల్లో ఈ జోడీ విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచులో ఈ జోడీ 6-3, 6-1 తేడాతో అన్ సీడెడ్ క్రీడాకారిణులు షిలిన్ యూ - జూ యూ (చెైనా) జోడీపై గెలిచింది.

ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచులో సానియా జంట 58 నిమిషాల్లోనే తుది పోరు ముగించి మరోసారి తన సత్తాను చాటుకుంది. ఈ టైటిల్‌తో ఈ ఏడాది సానియా ఏడు టైటిల్స్‌ను సాధించింది. ఇందులో ఆరు మార్టినా హింగిస్‌తో కాగా, మరోటి బెతాని మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సాధించింది.
ఈ ఏడాది మార్చి నుంచి సానియా, హింగిస్ జోడీ కట్టి అనూహ్యమైన విజయాలు సొంతం చేసుకుంటున్నారు. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ వింబుల్డన్, యుఎస్ ఓపెన్ టైటిల్స్ కూడా ఈ జోడీ గెలుచుకుంది. మహిళా డబుల్స్‌లో సానియా మీర్జా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.