
హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఈ ఏడాది అక్టోబర్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆమె అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. గర్భిణి సమయంలో కొన్ని నెలలు పాటు ఫిట్‌నెస్, వర్కవుట్లకు సానియా మిర్జా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా గర్భిణి సమయంలో ఆమె ఎక్కువ సమయం యోగాకే కేటాయించింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సానియా ప్రస్తుతం జిమ్‌లో కూడా సమయం గడుపుతోంది. గర్భధారణ సమయంలో వచ్చిన కాలరీలన్నింటినీ తగ్గించుకునే పనిలో ఉంది. జిమ్‌లో ఉన్నప్పటి ఫొటోను సానియా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
"గత ఫిట్‌నెస్‌ను సాధించడం ఆలస్యం కావచ్చు. కానీ, తప్పక సాధిస్తాను" అని ఇని సానియా కామెంట్ పెట్టింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు సైతం సానియా మిర్జాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బిడ్డకు జన్మనిచ్చి అతి తక్కువ రోజుల్లోనే జిమ్‌లో కసరత్తులు చేయడంపై ఆమెను అభినందిస్తున్నారు.
త్వరలోనే సానియా అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంటోందేమో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాజాగా సానియా తన కుమారుడు ఇజాన్‌తో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. "ఇజాన్‌ను ఇంట్లో వదిలి బయటికి వెళ్లడం చాలా కష్టంగా అనిపిస్తోంది. పనిలో ఉన్నంత సేపు ఎంతో క్లిష్టంగా ఉంది" అంటూ క్యాప్షన్ పెట్టింది.