లండన్: హోరా హోరీగా సాగిన వింబుల్డన్ మహిళల డబుల్స్ ఫైనల్లో భారత టెన్ని స్టార్ సానియా మీర్జా-మార్టినా హెంగిస్ జోడీ గెలుపొందింది. ఫైనల్లో మకరోవా-వెస్నీనా(రష్యా) జోడీపై సానియా-హెంగిస్ జోడీ 5-7, 7-6, 7-5 తేడాతో విజయం సాధించింది.

వింబుల్డన్ టైటిల్ గెలుచుకోవడం సానియాకు ఇదే తొలిసారి. కాగా, వింబుల్డన్ టైటిల్ గెలిచిన సానియా మీర్జా జోడీకి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. 'అద్భుతంగా ఆడావు. చారిత్రక వింబుల్డన్ విజయాన్ని సాధించావు. నీ విజయానికి మేమంతా గర్వపడుతూ సంతోషిస్తున్నాం' అని పేర్కొన్నారు.

వింబుల్డన్ మహిళల డబుల్ టైటిల్‌ను సాధించిన సానియా-హింగిస్ జోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియామీర్జా మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. సానియా తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటారని ప్రశంసించారు.