
హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పటల్‌లో ఆమె పురుడు పోసుకుంది. అయితే తన కుమారుడు ఇజాన్‌ను ఎత్తుకుని హాస్పటల్ నుంచి బయటకు వస్తున్న సానియా మీర్జా ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫ్యాన్స్ క్లబ్ ఆ ఫోటోను షేర్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ చకర్డ్ డ్రెస్సులో హాస్పటల్ నుంచి బయటకు వస్తున్న సానియా.. తన చేతుల్లో కుమారున్ని ఎత్తుకుని ఉంది.
సానియా, షోయబ్ జంటను అభినందిస్తూ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఐదు రోజుల తరవాత ఆన్‌లైన్‌లోకి వచ్చిన సానియా వాటికి బదులిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఓ ఫొటోనే కూడా షేర్ చేశారు. ఇప్పుడు అది ఆన్‌లైన్‌లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
'నేను ఒక అమ్మగా, ఇజాన్ ఒక కొడుకుగా మేము ఈ ప్రపంచంలోకి వచ్చి ఐదు రోజులు అవుతుంది. ఇద్దరం కలిసి టీవీలో షోయబ్ క్రికెట్ ఆడుతుంటే చూశాం. అయితే మేము ఐదు రోజుల కిందట ఆడింది అన్నింటికంటే పెద్ద మ్యాచ్. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం, అనుభవం నేనెప్పుడూ పొందలేదు. దాని తరవాత ఆన్‌లైన్‌లోకి రావడానికి ఇప్పుడు సమయం దొరికింది. మీ అందరిని నుంచి చాలా ప్రేమను పొందాం. ఆ సందేశాలతో మేం ఆనందంగా ఫీల్ అయ్యాం. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు' అని తన ఆనందాన్ని పంచుకున్నారు సానియా.
2010లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా పెళ్లి చేసుకుంది. సానియాకు కొడుకు పుట్టాడన్న విషయాన్ని షోయబ్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. తన కుమారుడికి ఇజాన్ మీర్జా మాలిక్ అన్న పేరు పెట్టినట్లు తెలిపాడు. ఇజాన్ అంటే అరబిక్ భాషలో దేవుడి బహుమతి అని అర్థం.