హైదరాబాద్: తన భారతీయతపై చెలరేగిన విమర్శలకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దీటైన జవాబిచ్చింది. యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తాను అంబాసిడర్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశానికి అంకింతమిస్తున్నట్టు సానియా ప్రకటించింది.
శుక్రవారం రాత్రి జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సానియా-బ్రూనో సోరెస్ జోడీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. బ్రూనోతో కలిసి టైటిల్ నెగ్గినందుకు చాలా ఆనందంగా ఉందని, ఈ విజయాన్ని నా దేశం, భారత్‌లోని ప్రతి ఒక్కరితో పాటు తెలంగాణ ప్రజలందరికీ అంకితమిస్తున్నానని, నా కల నిజమైనందుకు ఎంతో ఉత్సాహంగా ఉందని, భవిష్యత్‌లోనూ మరిన్ని విజయాలు సాధిస్తానని ఆశిస్తున్నానని ఫైనల్ మ్యాచ్ నెగ్గిన అనంతరం సానియా తెలిపింది.

కెరీర్‌లో మూడో మిక్స్‌డ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన సానియాను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. ఈ అరుదైన రికార్డుతో దేశం గర్వించేలా చేసిందని ప్రణబ్ సానియాకు సందేశం పంపారు. అంకితభావంతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చని సానియా నిరూపించిందన్నారు. భవిష్యత్‌లోనూ ఆమె మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తన లేఖలో తెలిపారు.
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సానియా మీర్జా యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ టైటిల్ నెగ్గడంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చే శారు. తెలంగాణ, హైదరాబాద్ పేరును నిలబెట్టిందంటూ సానియాను ఆయన అభినందించారు. మూడు మిక్స్‌డ్ గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కిన సానియాను చూసి తెలంగాణ ప్రజలు గర్విస్తున్నారన్నారు.