
హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా నటించిన యాడ్ ఒకటి వివాదాస్పదంగా మారింది. చికెన్ ఆరోగ్యకరమని, ఫిట్‌నెస్‌కు సహకరిస్తుందంటూ సానియా మిర్జా చెబుతున్నట్లుగా ఆల్ ఇండియా పౌల్ట్రీ డెవలప్‌మెంట్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ అడ్వర్‌టైజ్‌మెంట్‌ను రూపొందించింది. ఈ యాడ్ ఫిబ్రవరి 28న ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైంది.
తాజాగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) అనే ఏజెన్సీ నిర్వహించిన సర్వేలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. భారత్‌లో ఉన్న పౌల్ట్రీ ఫామ్‌లు కోళ్లను ఎలా పెంపొందిస్తున్నాయన్న దానిపై సీఎస్‌ఈ విపులంగా ఓ నివేదికను విడుదల చేసింది.

కొలిస్టిన్ అనే యాంటీ బయోటిక్ అనే ఔషదాన్ని కోళ్లపై ప్రయోగిస్తున్నారని , అది చాలా ప్రమాదకరమని నివేదికలో పేర్కొంది. సాధారణంగా కొలిస్టిన్‌ను తీవ్ర వ్యాధిగ్రస్తుల కోసం వాడుతుంటారు. పైగా చాలా దేశాల్లో దీనిపై నిషేధం ఉంది. కానీ, భారత్‌లో మాత్రం కోళ్లు వ్యాధిబారిన పడకుండా, అవి బరువు పెరిగేందుకు పౌల్ట్రీఫామ్ యాజమాన్యాలు దీనిని విరివిగా వినియోగిస్తున్నాయి.
ఈ యాడ్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నదని అడ్వర్‌టైజ్‌మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా తేల్చినట్లు సీఎస్‌ఈ వెల్లడించింది. దీంతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఓ పౌల్ట్రీ అడ్వర్‌టైజ్‌మెంట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని బహిరంగంగా చెప్పాలని సీఎస్‌ఈ సానియా మీర్జాను కోరింది.
గతంలోనూ ఈ యాడ్‌కు దూరంగా ఉండాలని సీఎస్‌ఈ సానియాను కోరింది. 'గతంలోనే సానియాకు ఓ లేఖ రాశాం. పౌల్ట్రీ రంగంలో యాంటీ బయాటిక్స్‌ని దుర్వినియోగం చేస్తున్న విషయాన్ని ఆమెకు వివరించాం. ఓ బాధ్యతాయుత రోల్ మోడల్‌గా ఇలాంటి యాడ్స్‌కు దూరంగా ఉండాలని సూచించాము. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాం' అని సీఎస్‌ఈలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా ఉన్న అమిత్ ఖురానా చెప్పారు.
మరోవైపు తాము యాంటీ బయాటిక్స్‌ను దుర్వినియోగం చేయడం లేదని ఆ యాడ్ చెప్పడం అబద్ధమని సీఎస్‌ఈ స్పష్టంచేసింది. 2014లో జరిపిన పరీక్షల్లో చికెన్‌లో యాంటీ బయాటిక్స్ అవశేషాలను సీఎస్‌ఈ గుర్తించింది. మే 23వ తేదీలోగా యాడ్‌ను సవరించాలని లేదా తొలగించడమో చేయాలని అడ్వర్‌టైజ్‌మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఆలిండియా పౌల్ట్రీ డెవలప్‌మెంట్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్‌ను ఆదేశించింది.