హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, సినీ, పారిశ్రామిక ప్రముఖులు మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చారు.
అయితే, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాత్రం అందరికంటే చివరన మేల్కొన్నారు. కార్యక్రమం మొదలై దాదాపు వారం గడిచిన తర్వాత గురువారం హరితహారంలో భాగంగా మొక్కలను నాటి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. అయితే, ఆమెపై అప్పటికే అనేక సెటర్లు, విమర్శలు వచ్చాయి.
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ పేరిట కోటి రూపాయలు తీసుకున్న సానియా కనీసం ఒక్క మొక్కైనా నాటడానికైనా రాకపోవడమేమిటని సోషల్ మీడియా ద్వారా పలువురు ప్రశ్నించారు. ఆమెతో కోటి మొక్కలు నాటించాలని, ఆమెతో కోటి తట్టల మట్టి మోయించాలని ఇలా రకరకాలుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వేశారు.
కాగా, సానియా మీర్జాకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసి రూ. కోటి నజరానా ప్రకటించి జులై 22 నాటికి సరిగ్గా ఏడాది గడిచింది. అంతేగాక, 2014లో సాధించిన విజయాలకు గాను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాక్చర్ కార్పొరేషన్(టిఎస్ఐఐసి) ద్వారా తెలంగాణ ప్రభుత్వం మరో రూ. కోటి విలువైన భూమిని సానియాకు ఇచ్చింది. అయితే, ఇప్పటి వరకు ఆ భూమి సానియా చేతికి రాలేదని సమాచారం.
అయితే, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సానియా మీర్జా ఇప్పటి వరకు ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో దాదాపు పాల్గొనలేదు. ఇటీవల సీఎం కెసిఆర్ ప్రారంభించిన హరితహారంలో కూడా అనేక మంది ప్రముఖులు పాల్పంచుకున్నప్పటికీ సానియ కానరాలేదు.
ఈ నేపథ్యంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇవి సానియా వరకు చేరాయో లేక ఆమె స్వయంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారో తెలియదు గానీ, ఎట్టకేలకు గురువారం మొక్కలు నాటి అందరి దృష్టిని మరోసారి ఆకర్షించారు.
అయితే, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ లాంటి ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఉండి కూడా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామి కావడం లేదని కొందరు అధికారులు చెబుతున్నారు.