
హైదరాబాద్: స్విస్ టెన్నిస్ దిగ్గజం, డిఫెండింగ్ ఛాంపియన్ రోజర్ ఫెదరర్ ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచాడు. మెల్‌బోర్న్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఆరోసీడ్ మారిన్ సిలిచ్‌పై 6-2, 6-7, 6-3, 3-6, 6-1 తేడాతో ఘన విజయం సాధించాడు. తాజా గ్రాండ్‌స్లామ్ ఫెదరర్‌కు తన కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం.
తాజా విజయంతో ఫెదరర్ అరుదైన ఘనత సాధించాడు. ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన రాయ్ ఎమర్సన్, నొవాక్ జొకోవిచ్‌ల సరసన నిలిచాడు. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఫైనల్లో తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచినప్పటికీ, విజయం కోసం ఫెదరర్ చెమటోడ్చాడు.
రెండో సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయాడు. ఇక మూడో సెట్‌లో సిలిచ్ సర్వీస్ బ్రేక్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లిన ఫెదరర్ ఆ తర్వాత తన సర్వీసులను అద్భుతంగా డిఫెండ్ చేసుకొని 6-3తో కైవసం చేసుకున్నాడు. ఇక, నాలుగో సెట్‌లో పుంజుకున్న సిలిచ్... ఫెదరర్ సర్వీస్ బ్రేక్ చేసి 6-3తో గెలిచాడు.
దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక ఐదో సెట్‌కు చేరింది. ఐదో సెట్‌లో ఫెదరర్ అద్భుత ప్రదర్శన చేశాడు. తన ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా పాయింట్లు సాధిస్తూ దూసుకెళ్లాడు. ఈ క్రమంలో రెండుసార్లు సిలిచ్ సర్వీస్ బ్రేక్ చేసి 6-1తో గెలిచాడు. దీంతో ఆరోసారి రోజర్ ఫెదరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచాడు. గతేడాది జరిగిన ఫైనల్లో తన చిరకాల ప్రత్యర్థి రఫెల్ నాదల్‌ను ఓడించి ఫెదరర్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.