
లండన్: 2019 వింబుల్డన్ ఫైనల్‌లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ మధ్య అద్భుత పోరాటాన్ని అభిమానులు అంత సునాయాసంగా మరిచిపోరు. అయిదు సెట్ల హోరాహోరీ పోరులో జకోవిచ్ రెండు మ్యాచ్ పాయింట్లు కాచుకుని టైటిల్ గెలిచాడు. కరోనా కారణంగా గతేడాది టోర్నీ జరగని విషయం తెలిసిందే. ఇప్పుడు జరుగనున్న వింబుల్డన్‌లో మరోసారి ఫెదరర్, జకోవిచ్ మధ్య ఫైనల్ పోరాటం అభిమానులకు కనువిందు చేసే అవకాశముంది. ఈసారి వీరిద్దరు వేర్వేరు పార్శ్వాల్లో టైటిల్ కోసం పోటీపడనున్నారు.
శుక్రవారం వింబుల్డన్ నిర్వాహకులు డ్రా విడుదల చేశారు. తొలి రౌండ్లో నోవాక్ జకోవిచ్.. వైల్డ్ కార్డు ఎంట్రీ 19 ఏళ్ల జాక్ డ్రేపర్‌తో ఆడనున్నాడు. రోజర్ ఫెదరర్ ఫ్రాన్స్ ఆటగాడు అడ్రియన్ మనారినోతో తొలి పోరు ఆడనున్నాడు. 13వసారి వింబుల్డన్ ఫైనల్ చేరుకోవాలంటే మాత్రం అతడు డానియెల్ మెద్వెదెవ్, అలెగ్జాండర్ జ్వెరెవ్‌లను ఓడించాల్సి ఉంటుంది. రెండుసార్లు ఛాంప్ ఆండీ ముర్రే (బ్రిటన్) 24వ సీడ్ నికోల్జ్ బసిలాష్విలితో తొలి రౌండ్లో పోటీపడనున్నాడు. జకోవిచ్, ముర్రే సెమీస్‌లో ఎదురుపడొచ్చు. నం.3 నాదల్, నం.5 డొమినిక్ థీమ్ వింబుల్డన్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.
మహిళల విభాగంలో 24వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ తొలి రౌండ్లో 100వ ర్యాంక్ క్రీడాకారిణి అలెక్‌జాండ్ర సాస్నోవిచ్‌తో తలపడనుంది. క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ ఆష్ బార్టీ, అయిదో సీడ్ బియాంకా ఆండ్రెస్కూ.. అయిదో సీడ్ ఎలీనా స్వితోలినాతో ఆరోసీడ్ సెరెనా ఢీకొనే అవకాశముంది. సోమవారం వింబుల్డన్ ఆరంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ సిమోనా హలెప్ గాయం కారణంగా టోర్నీకి దూరమైంది. కాలి గాయంతో బాధపడుతున్న హలెప్ ఈ నిర్ణయం తీసుకుంది. రోమ్ వేదికగా మేలో జరిగిన డబ్ల్యూటీఏ ఈవెంట్లో గాయం కారణంగా హలెప్ ఆట మధ్యలోనే తప్పుకొంది. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ పాల్గొనలేదు.
జపాన్ స్డార్ నవోమీ ఒసాకా సైతం వింబుల్డన్ టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపింది. ఒలింపిక్స్ సన్నద్ధత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ నుంచి కూడా ఒసాకా అనూహ్యంగా వైదొలిగింది. మొదటి రౌండ్ గెలిచాక ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరు కాలేకపోవడం వల్ల ఆమెకు అధికారులు జరిమానా విధించారు. దీంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది.