నెంబర్ వన్: టెన్నిస్ చరిత్రలోనే అరుదైన ఘనత సాధించిన ఫెదరర్
హైదరాబాద్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తన పనైపోయిందని విమర్శకులంతా అభిప్రాయపడిన వేళ.. గతేడాది తన అద్భుత ప్రదర్శనతో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను నెగ్గిన ఫెదరర్ ఈ సీజన్‌లో కూడా అదే జోరు కొనసాగిస్తున్నాడు. 36 ఏళ్ల వయసులో వరల్డ్ నెంబర్ వన్ అయి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను నెగ్గిన రోజర్ ఫెదరర్ తాజాగా రోటర్‌డామ్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకొని ఆరేళ్ల తర్వాత మళ్లీ వరల్డ్ నెంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.

టెన్నిస్ చరిత్రలో ఈ ఘనత సాధించిన పెద్ద వయస్కుడిగా
తద్వారా టెన్నిస్ చరిత్రలో ఈ ఘనత సాధించిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ 4-6, 6-1, 6-1తో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. దీంతో అగ్రస్థానం సొంతం చేసుకోవడానికి అవసరమైన ర్యాంకింగ్ పాయింట్లు ఫెదరర్ ఖాతాలో చేరాయి.

మళ్లీ నెంబర్‌వన్ స్థానం కైవసం చేసుకోవడం నిజంగా అద్భుతం
సోమవారం విడుదల చేసే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఫెదరర్ మళ్లీ టాప్ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. 26 వారాలుగా నెంబర్‌వన్ స్థానంలో తన చిరకాల ప్రత్యర్థి రఫెల్ నాదల్(స్పెయిన్) రెండో స్ధానానికి పడిపోనున్నాడు. ఈ సందర్భంగా ఫెదరర్ మాట్లాడుతూ ‘మళ్లీ నెంబర్‌వన్ స్థానం కైవసం చేసుకోవడం నిజంగా అద్భుతం' అని అన్నాడు.

మరోసారి నా కల నిజమైందని భావిస్తున్నా
'అద్భుతంగా ఆడుతున్న సమయంలో అనుకోకుండా అగ్రస్థానానికి వస్తాం. ఆ తర్వాత దానిని నిలబెట్టుకోవాలని తీవ్రంగా శ్రమించే క్రమంలో వేరే వాళ్లకు కోల్పోతాం. వయసు పెరిగేకొద్దీ మళ్లీ ఆ ర్యాంక్‌ను అందుకోవాలంటే రెండు రెట్లు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ విషయంలో నేను మళ్లీ విజయవంతం అయ్యాను. మరోసారి నా కల నిజమైందని భావిస్తున్నాను. తిరిగి టాప్ ర్యాంక్ అందుకుంటున్నానంటే నాకే నమ్మశక్యంగా లేదు' ఫెదదర్ సంతోషం వ్యక్తం చేశాడు.

2012 అక్టోబరు తర్వాత ఫెదరర్ టాప్ ర్యాంక్‌కు చేరడం ఇదే తొలిసారి
కాగా, అతిపెద్ద వయస్సులో టాప్ ర్యాంక్ పొందిన ఆటగాడి రికార్డు అమెరికాకు చెందిన ఆండ్రీ అగస్సీ (33 ఏళ్లు) పేరిట ఉంది. రోజర్ ఫెదరర్ ఇప్పుడు ఆ రికార్డును అధిగమించాడు. 2003లో 33 ఏళ్ల అగాసీ 131 రోజులపాటు నెంబర్‌వన్‌గా కొనసాగాడు. ఇక 2012 అక్టోబరు తర్వాత ఫెదరర్ టాప్ ర్యాంక్‌కు చేరడం ఇదే తొలిసారి. అంతేకాదు, కోల్పోయిన టాప్ ర్యాంక్‌ను మళ్లీ అందుకునేందుకు ఎక్కువ విరామం (5 ఏళ్ల 106 రోజులు) తీసుకున్న ప్లేయర్‌గానూ ఫెదరర్ రికార్డు నెలకొల్పాడు.

తన కెరీర్‌లో 2004 ఫిబ్రవరి 2న తొలిసారి నెంబర్‌వన్
2012 నవంబర్ 4న నెంబర్‌వన్ ర్యాంక్ చేజార్చుకున్న ఫెదరర్ ఫిబ్రవరి 19న మళ్లీ నెంబర్ వన్ ర్యాంకుని అందుకోనున్నాడు. తన కెరీర్‌లో 2004 ఫిబ్రవరి 2న తొలిసారి నెంబర్‌వన్ అయిన ఫెదరర్ రికార్డుస్థాయిలో వరుసగా 237 వారాలు ఆ స్థానంలో ఉన్నాడు. 2008 ఆగస్టు 17న టాప్ ర్యాంక్ కోల్పోయిన అతను మళ్లీ రెండుసార్లు (2009 జూలై 6 నుంచి 2010 జూన్ 6 వరకు; 2012 జూలై 9 నుంచి 2012 నవంబర్ 4 వరకు) నెంబర్ వన్ ర్యాంకుని దక్కించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications