
మాడ్రిడ్: స్పెయిన్ బుల్, 19 సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ రఫెల్ నాదల్ ఓ ఇంటి వాడయ్యాడు. శనివారం తన గర్ల్‌ఫ్రెండ్ షిస్కా పెరిల్లోను నాదల్ వివాహం చేసుకున్నాడు. 14 ఏళ్లుగా డేటింగ్‌లో రఫెల్ నాదల్ (33), షిస్కా పెరిల్లో (31)లు ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. స్పెయిన్ దీవుల్లోని మలోర్కాలో వీరిద్దరి వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహానికి 1975 నుండి 2014 వరకు స్పెయిన్ రాజుగా ఉన్న జువాన్ కార్లోస్ కూడా హాజరైనట్లు సమాచారం తెలుస్తోంది.
రఫెల్ నాదల్, షిస్కా పెరిల్లోల వివాహానికి దాదాపు 350 మందికిపైగా సన్నిహితులు, అతిథులు హాజరయ్యారు. పెళ్ళికి సంబంధించిన ఫోటోలను మాత్రం నాదల్ ఇంకా మీడియాకు విడుదల చేయలేదు. తన సోదరి మారిబెల్ చిన్ననాటి స్నేహితురాలైన షిస్కా పెరిల్లోను నాదల్ 14 ఏళ్ల క్రితం ఓ వేడుకలో కలిశాడు. ఆ పరిచయం కాస్త స్నేహంగా.. అనంతరం ప్రేమగా మారింది. 14 ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్న నాదల్.. చివరకు పెళ్లి చేసుకున్నాడు.
రఫెల్ నాదల్ పెళ్లికి స్పెయిన్ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాళ్లు లోపెజ్, డేవిడ్ ఫెరర్‌లు హాజరయ్యారు. అయితే స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్, సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ మాత్రం పెళ్లికి హాజరు కాలేదు. ప్రస్తుత ఆటగాళ్లు ఎవరూ నాదల్ పెళ్ళికి రాలేదని సమాచారం. ప్రస్తుతం స్విస్ ఇండోర్ బాసిల్ టైటిల్ నిలబెట్టుకునేందుకు ప్రాక్టీస్‌లో ఉన్న ఫెడరర్.. నాదల్ పెళ్లికి దూరంగా ఉన్నాడు. మణికట్టు గాయంతో నాదల్ షాంఘై మాస్టర్స్ నుండి వైదొలగాల్సి వచ్చింది. బుల్ షాంఘై నుండి తప్పుకోవడం వరుసగా రెండో సంవత్సరం. లావర్ కప్ నుండి కూడా తప్పుకున్నాడు.
నాదల్ తోటి ఆటగాళ్లు రోజర్ ఫెడరర్, నొవాక్ జొకోవిచ్, ఆండీ మర్రే వివాహం చేసుకోవడంతో పాటు పిల్లలనూ కన్నారు. కానీ 33 ఏళ్ల నాదల్ ఇప్పుడు ఓ ఇంటి వాడయ్యాడు. టెన్నిస్ పట్ల ఉన్న కమిట్‌మెంట్‌తో పాటు ఆడడంలో తాను పొందుతున్న ఆనందానికి ఆటంకాలు కలగకూడదనే పెళ్లి, పిల్లలు వద్దనుకుంటున్నా అని నాదల్ గతంలో చెప్పాడు. పిల్లల విషయంలో కచ్చితంగా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాడు. అయితే తనకు ముగ్గురు పిల్లలు కావాలని కూడా ఓ సందర్భంలో వెల్లడించాడు.