సానియా మీర్జా స్ట్లైల్: మీడియాతో ఇలా (పిక్చర్స్)
హైదరాబాద్: వరుస విజయాలతో స్టార్ టెన్నిస్ క్రీడాకారిణిగా వెలుగొందుతున్న తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా సోమవారం మీడియాతో మాట్లాడింది. ఆసియాడ్‌తో పాటు చైనా ఓపెన్‌ను ముగించుకొని నగరానికి తిరిగి వచ్చింది. చాలా విషయాల గురించి తనదైన శైలిలో మాట్లాడింది. తన భర్త షోయబ్ మాలిక్ హైదరాబాద్ వచ్చినప్పుడు తాను లేకపోవడం బాధగానే ఉందంటూనే త్యాగాలు తప్పవని చెప్పింది.
కీలకమైన ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోతానని తెలిసినా ఆసియా క్రీడల్లో పాల్గొనాలన్న తన నిర్ణయం సరైనదేనని సానియా చెప్పింది. ఇటీవల ముగిసిన ఆసియాడ్‌లో ఆమె మిక్స్‌డ్ డబుల్స్‌లో సాకేత్ మైనేనితో కలిసి స్వర్ణం, మహిళల డబుల్స్‌లో ప్రార్థన తోంబరెతో కలిసి కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో రెండు పతకాలు సాధించడం సంతృప్తినిచ్చిందని సానియా తెలిపింది.
గత ఆరు వారాలు చాలా అద్భుతంగా గడిచాయి. ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్ననని మహిళల డబుల్స్‌లో తొలిసారి పతకం సాధించినందుకు ఆనందంగా ఉందని చెప్పింది. అంతగా అంచనాలు లేకున్నా భారత టెన్నిస్ జట్టు ఐదు పతకాలతో తిరిగి రావడం గర్వించదగ్గ విషయమని చెప్పింది.

సాకేత్‌కు కితాబు
ఇక ఆసియాడ్‌లో తన మిక్స్‌డ్ సహచరుడు సాకేత్ ఉత్తమ ఆటగాడని సానియా కితాబిచ్చింది. ఈ టోర్నీలో సాకేత్ సామర్థ్యం మేరకు ఆడలేదని అనుకుంటున్నానని అన్నది.

కల సాకారమైంది..
ఆసియాడ్‌లో స్వర్ణం సాధించాలన్న అతని కల సాకారమైందని సానియా పొంగిపోయింది. ఈ స్వర్ణం అతని కెరీర్‌కు మరింత ఊపునిస్తుందని చెప్పింది.

ప్రాక్టీస్ చేశాం..
ఆసియా క్రీడల్లో తన జోడీ సాకేత్ అని తెలియగానే ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేశామని, దీంతో ఒకరి ఆటతీరుపై మరొకరికి అవగాహన వచ్చిందని, ఆరంభంలో ఇబ్బంది పడ్డా టోర్నీ జరుగుతున్న కొద్దీ మెరుగయ్యామని చెప్పింది.

దేశానికే ప్రాతినిథ్యం వహిస్తున్నా..
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన తర్వాత ఇన్ని విజయాలు దక్కడం యాదృచ్చికమే అని సానియా ఒక ప్రశ్నకు బదులుగా చెప్పింది. తానెప్పుడూ దేశానికే ప్రాతినిథ్యం వహిస్తున్నానని చెప్పింది. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించినందుకు ఆనందంగా ఉందని చెప్పింది. ఇక తెలంగాణ రాయబారిగాఎంపిక కావడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపింది.

త్యాగాలు తప్పవు
సీఎల్‌టీ20లో భాగంగా నగరానికి వచ్చిన భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇన్నింగ్స్‌ను చూడలేకపోయినందుకు బాధగా ఉందా? అన్న ప్రశ్నకు తాను ఆ మ్యాచ్‌ను టీవీలో చూశానని చెప్పింది. ప్రొఫెషనల్ ఆటగాళ్లకు దేశానికి ప్రాతినిథ్యం వహించడమే ముఖ్యమని, దేశానికి ఆడుతున్నప్పుడు ఇటువంటి విషయాల్లో కొన్ని త్యాగాలు తప్పవని సానియా బదులిచ్చింది.

కారా ఆప్త మిత్రురాలు
వచ్చే ఏడాది నుంచి చైనీస్ తైపీ ప్లేయర్ సూ వెయ్‌తోనే డబుల్స్‌లో ఆడతానని సానియా చెప్పింది. ఇక తన ప్రస్తుత సహచరి కారా బ్లాక్ (జింబాబ్వే)తో విడిపోవడం వెనుక ప్రొఫెషనల్ కారణాలే ఉన్నాయని, వాటిని బహిర్గతం చేయలేనని చెప్పింది. కారా తనకు ఆప్త మిత్రురాలంది. ఇక మిక్స్‌డ్‌లో బ్రూనోతో కలిసి బరిలోకి దిగుతానని స్పష్టం చేసింది.

ఒలింపిక్స్.. తర్వాత చూద్దాం
రియో ఒలింపిక్స్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని.. ప్రస్తుతం తన దృష్టంతా సింగపూర్ ఓపెన్ పైనే ఉందని సానియా చెప్పింది.

అప్పటికి ఎలా ఉంటానో..
తానిప్పుడు చాలా సీనియర్ ప్లేయర్‌నని, 2016లో జరిగే ఒలింపిక్స్ గురించి కలలు కనేంత చిన్న వయసులో లేనంది. అప్పటికి తన శరీరం సహకరిస్తుందో లేదో చూడాలని సానియా చెప్పింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications