
హైదరాబాద్: తాను టెన్నిస్ ప్లేయర్‌గా మారాలని అనుకున్నప్పడు చుట్టుపక్కల వారు హేళన చేశారని, అయితే తన తల్లిదండ్రులు మాత్రం మద్దతుగా నిలిచారని భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా గుర్తు చేసుకుంది. బుధవారం జరిగిన ఐక్యరాజ్య సమితి మహిళల ప్రచార గీతం 'ముఝే హక్ హై' కార్యక్రమంలో మహిళా క్రికెటర్ మిథాలీరాజ్‌తో కలిసి సానియా మీర్జా పాల్గొంది.
ఈ సందర్భంగా సానియా మిర్జా మాట్లాడుతూ "ఆరేళ్ల వయసప్పుడు నేను టెన్నిస్ ఆడడం ఆరంభించా. అప్పట్లో హైదరాబాద్‌లో ఓ అమ్మాయి టెన్నిస్ ఆడటం ఎవరూ విని ఉండరు. నేను క్రికెటర్ల కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న కూడా క్రికెటరే" అని సానియా చెప్పింది.
టెన్నిస్ ఆడితే నల్లగా అయిపోతుందని, ఎవరూ పెళ్లి చేసుకోరని తన బంధువులు అన్న మాటలను కూడా సానియా మిర్జా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. కానీ తన తండ్రి అందరికీ ఎదురు నిలిచాడని గర్వంగా చెప్పుకొచ్చింది.
"మా బంధువుల్లో కొంత మంది మార్టినా హింగిస్ అవుతుందా? అని ఎగతాళి చేశారు.. అలాంటిది ఆమెతోనే మూడు గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గా. నా వరకు మానాన్నే ఓ గొప్ప హీరో. నా విషయంలో నా తండ్రి అందరికి ఎదురు నిలిచాడు" అని సానియా మిర్జా చెప్పింది.
ప్రస్తుతం గర్భవతిగా ఉన్న సానియా మిర్జా... తన భర్త షోయబ్ మాలిక్ తమకు అమ్మాయే పుట్టాలని బలంగా కోరుకుంటున్నట్టు గర్భవతి అయిన సానియా తెలిపింది. 2016లో వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన కాశ్మీరీ బాలిక తజముల్ ఇస్లామ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది.