
హైదరాబాద్: 'నా జీవితంలో అత్యుత్తమ వారాల్లో ఇదొకటి' రోటర్‌డామ్ ఓపెన్ టోర్నీ ముగిసిన అనంతరం స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అన్న మాటలివి. ఈ టోర్నీ విజయంతో ఫెదరర్ తన కెరీర్‌లో 97వ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
ఆదివారం ముగిసిన రోటర్‌డామ్ ఓపెన్ టోర్నీలో ఫెదరర్ మూడోసారి చాంపియన్‌గా నిలిచాడు. మొత్తం మీద ఈ సీజన్‌లో రోజర్‌కు ఇది రెండో టైటిల్ కావడం విశేషం. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెదరర్ టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో రోజర్ 6-2, 6-2తో వరుస సెట్లలో గ్రిగర్ దిమిత్రోవ్‌ను అలవోకగా ఓడించాడు. 55 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో ఫెడరర్ మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు.
మ్యాచ్ అనంతరం ఫెదరర్ మాట్లాడుతూ 'ఇదొక అద్భుతమైన వారం. సెమీ పైనల్స్‌కు అర్హత సాధించడంతో ఈ వారం ప్రారంభమైంది. ఈ వారం నిజంగా అద్భుతం. చాలా సంతోషంగా ఉంది' అని అన్నాడు. తాజా విజయంతో 20 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ఫెదరర్ తన కెరీర్‌లో వంద టైటిళ్ల లక్ష్యానికి చేరువయ్యాడు.
టెన్నిస్ ఓపెన్ ఎరాలో ఆమెరికాకు చెందిన జిమ్మీ కాన్నర్స్ 109 టైటిళ్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనున్న సంగతి తెలిసిందే.
తాజా విజయంతో ఫెదరర్ నెంబర్ వన్ ర్యాంక్ నాలుగు వారాల పాటు ఉండనుంది. రోటర్‌డామ్ ఓపెన్ టోర్నీ విజేతగా నిలిచిన ఫెదరర్‌కు 4,01,580 యూరోల (రూ. 3 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.