
హైదరాబాద్: ఓ టెన్నిస్ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత బ్రిటన్ టెన్నిస్ ప్లేయర్, వరల్డ్ మాజీ నెంబర్ వన్ ఆండీ ముర్రే కోర్టులోనే చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు టెన్నిస్‌కు దూరమైన ముర్రే ప్రస్తుతం ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 832వ స్థానంలో కొనసాగుతున్నాడు. చాలా రోజుల తర్వాత అమెరికాలో జరుగుతున్న సిటీ ఓపెన్ ఏటీపీ-500 టెన్నిస్ టోర్నీలో పాల్గొన్నాడు.
టోర్నీలో భాగంగా ప్రీక్వార్టర్స్‌లో 93వ ర్యాంకు మారియస్ కోపిల్(రొమేనియా)తో హోరాహోరీ పోరులో 6-7(5), 6-3, 7-6(4) తేడాతో గెలుపొంది బ్రిటన్‌స్టార్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో 19ఏళ్ల అలెక్స్ డీ మినార్(ఆస్ట్రేలియా)తో ఆండీ తలపడనున్నాడు.
అయితే, వర్షం కారణంగా అర్ధరాత్రి తర్వాత ఆలస్యంగా ప్రారంభమైన ప్రీక్వార్టర్స్ మ్యాచ్ తెల్లవారుజామున 03:02 గంటలకు ముగియడంతో ఆ తర్వాత మ్యాచ్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ముర్రే తెలిపాడు. కాగా, సుధీర్ఘంగా ఈ మ్యాచ్‌లో తీవ్రంగా శ్రమించిన ముర్రే చివరికి పైచేయి సాధించాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత ముర్రే భావోద్వేగానికి గురయ్యాడు. అత్యుత్తమ ప్రదర్శన చేసి మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత ముర్రే బెంచ్‌పై కూర్చొని టవల్‌ను అడ్డుపెట్టుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. కోర్టులోనే చాలాసేపు ఒంటరిగా కూర్చొని చిన్నపిల్లాడిలా ఏడ్చాడు.