
హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ తన జోరుని కొనసాగిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో రోజర్ ఫెదరర్‌పై గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ 7-6(7/1), 6-4, 6-3 తేడాతో ఫెదరర్‌పై గెలిచాడు.
తాజా విజయంతో నొవాక్ జొకోవిచ్ ఎనిమిదోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇప్పటికే ఏడుసార్లు ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన జొకోవిచ్ మరో టైటిల్‌పై కన్నేశాడు. జొకోవిచ్ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019ల్లో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లను గెలిచాడు. అంతేకాదు ఈ విజయంతో ఫెదరర్‌పై తన ముఖాముఖి రికార్డును 27-23కు పెంచుకున్నాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రోజర్ ఫెదరర్‌తో జొకోవిచ్ మొత్తం ఐదు సార్లు తలపడగా ఐదు సార్లు జొకోవిచే నెగ్గాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగే మెల్‌బోర్న్ పార్కులో 2007 నుండి 2012 వరకు జొకోవిచ్ ఫెదరర్ చేతిలో ఓడిపోలేదు. అంతేకాదు ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లో జొకోవిచ్ తన అజేయ రికార్డును కూడా కొనసాగించాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన ఏడు సార్లూ జొకోవిచ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు జొకోవిచ్ 16 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించాడు. రెండో సెమీ ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్-డొమినిక్ థీమ్‌లు తలపడనున్నారు. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన వారితో ఆదివారం జరిగే ఫైనల్లో జొకోవిచ్ తలపడనున్నాడు.