న్యూయార్క్: 'ఫెడెక్స్' గా అభిమానులు ముద్దుగా పిచుకునే రోజర్ ఫెదరర్‌కు మరో ఓటమి. యుఎస్ ఓపెన్ - 2015 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌పై 6-4, 5-7, 6-4, 6-4 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు.
సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్‌కు ఇది పదో గ్రాండ్ స్లామ్. యుఎస్ ఓపెన్‌లో తొలి నుంచి ప్రత్యర్ధులపై ఆధిపత్యం చెలాయిస్తూ ఫైనల్‌కు చేరుకున్న జకోవిచ్ పైనల్లో కూడా విజయం సాధించాడు. ర్యాంకుల ప్రకారం తొలి, రెండు స్థానాల్లో ఉన్న జకోవిచ్, ఫెదరర్ పోరు అభిమానులకు కనువిందు చేసింది.
18వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫైనల్స్‌లో నాలుగు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన పోరులో నోవాన్ జకోవిచ్‌నే విజయం వరించింది. తొలి సెట్‌ను కోల్పోయిన ఫెదరర్ ఆ మరుసటి సెట్లోనే పుంజుకున్నా ఫలితం లేకపోయింది.

రెండో సెట్‌లో ఫెదరర తన ఆధిపత్యాన్ని కనబర్చినా, మూడో సెట్‌లో జకోవిచ్ అద్భుతంగా ఆడాడు. మూడో సెట్‌ను 6-4తో గెలుచుకున్న జకోవిచ్, నాలుగో సెట్ లోనూ పైచేయి సాధించి టైటిల్ విజేతగా నిలిచాడు. ఈ ఏడాది వింబుల్డన్, ఆస్ట్రేలియా ఓపెన్లను కైవసం చేసుకున్న జకోవిచ్ యూఎస్ ఓపెన్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.
మ్యాచ్ విజయానంతరం నోవాక్ జకోవిచ్ మాట్లాడుతూ 'నేనో భర్తను, తండ్రిని. ఈ విజయం మరింత మధురమైనది' అని అన్నారు. జకోవిచ్ యుఎస్ ఓపెన్ టైటిల్‌ను గెలవడం ఇది రెండోసారి. ఈ ఏడాది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్న జొకోవిచ్ తన కెరీర్లో పదో గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాడు.