
బెల్‌గ్రేడ్: ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆడించిన ఆటతో కరోనా వైరస్ పాజిటివ్ బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. అడ్రియా టూర్ ఎగ్జిబిషన్ టోర్నీ ద్వారా తాజాగా క్రొయేషియా టెన్నిస్ దిగ్గజం, మాజీ వింబుల్డన్ ఛాంపియన్, జొకోవిచ్ కోచ్ అయిన గొరాన్ ఇవానిసెవిచ్ కరోనా బారిన పడ్డాడు. కరోనా లక్షణాలు లేకపోయినా తాను వైరస్ బారిన పడ్డానని గొరాన్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇటీవల జరిగిన అడ్రియా టూర్ ఎగ్జిబిషన్ సిరీస్‌కు వెళ్లిన గొరాన్ ఇవానిసెవిచ్‌కు కరోనా వైరస్ పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. గత పది రోజుల్లో ఇవాన్‌కు రెండుసార్లు నెగెటివ్ వచ్చినా.. తాజాగా నిర్వహించిన పరీక్షలో మాత్రం పాజిటివ్ అని తేలింది. '10 రోజుల క్రితం రెండుసార్లు కోవిడ్ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. తాజాగా మూడోసారి వైరస్ పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. లక్షణాలు లేకపోయినా వైరస్ బారిన పడ్డాను. ఇటీవల నాతో సన్నిహితంగా మెలిగిన వారు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోండి' అని గొరాన్ సూచించారు. 2001లో గొరాన్ వింబుల్డన్ టైటిల్ విజేతగా నిలిచాడు.
అడ్రియా టూర్‌లో సెర్బియా అంచె పోటీలు ముగిశాక.. క్రొయేషియాలో రెండో అంచె పోటీలు నిర్వహిస్తుండగా ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఫైనల్ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇప్పటికే నిర్వాహకుడు, ఆటగాడు జొకోవిచ్ సహా మరో ముగ్గురు ప్లేయర్లు గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా), బోర్నా కోరిచ్ (క్రొయేషియా), విక్టొర్ ట్రయోకీ(సెర్బియా)లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగానే ఉండడం సంతోషకర విషయం. వైరస్ వ్యాప్తిని నిర్లక్ష్యం చేస్తూ.. ఎలాంటి జాగ్రత్తలు, నిబంధనలు పాటించకుండా ఆటగాళ్లకు వైరస్ సోకడంలో జొకో పరోక్షంగా కారకుడయ్యాడంటూ అంతా దుమ్మెత్తిపోస్తున్నారు.
టోర్నీలో పాల్గొన్న డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) తమ ప్రవర్తన తప్పేనని పేర్కొన్నాడు. 'నోవాక్ జకోవిచ్‌తో సహా ఆడ్రియా టూర్‌లో ఆడిన నలుగురు ఆటగాళ్లకు కరోనా సోకిందని తెలిసి షాక్‌కు గురయ్యా. ఆ టోర్నీకి ముందు కొన్ని వారాలుగా ఖాళీ స్టేడియాల్లో ఆడాం. దాంతో ఆ టోర్నీకి అభిమానులు హాజరుకావడంతో ఆనందపడ్డాం. సెర్బియా ప్రభుత్వ నిబంధనలను గట్టిగా నమ్మాం. ఎంతో ఆశాజనకంగా టూర్ టోర్నీలో బరిలో దిగాం. కానీ మేం తప్పుగా ప్రవర్తించాం. టోర్నీ జరిగినపుడు భౌతిక దూరం నిబంధనలు మరిచి ప్రవర్తించడం సరికాదు. మేం మితిమీరిన ఉత్సాహం ప్రదర్శించాం. అది ముమ్మాటికీ పొరపాటే. దానికి క్షమాపణలు కోరుతున్నా. గత పది రోజుల్లో అయిదుసార్లు వైరస్ పరీక్షలు జరిపించుకోగా.. నెగెటివ్‌గానే తేలింది. వైరస్ బారిన పడ్డ ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా' అని థీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.