
బెల్‌గ్రేడ్: ప్రపంచ టెన్నిస్ నెంబర్‌వన్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ కంటతడి పెట్టాడు.స్వదేశంలో అభిమానుల మధ్య బల్కన్స్ చారిటీ టెన్నిస్ టోర్నీని నిర్వహించిన జొకోవిచ్.. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. క్రీడల పునరుద్ధరణలో భాగంగా తన సొంత నగరం బెల్‌గ్రేడ్‌లోని నొవాక్ టెన్నిస్ సెంటర్‌లో నిర్వహించిన టోర్నీకి హాజరైన అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తూ జొకో ఉద్వేగానికి గురయ్యాడు.
గతంలో బెల్‌గ్రేడ్‌లో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని నొవాక్ జొకోవిచ్ కన్నీటి పర్యంతమయ్యాడు. 'టోర్నీ నుంచి వైదొలిగినందుకు నేను ఏడ్వడం లేదు. ఈ రోజు చాలా భావోద్వేగానికి లోనయ్యా. నాకు చిన్నతనం గుర్తుకు వస్తున్నది. ఇదే కోర్టుల్లో చిన్నప్పటి నుంచి ఆడా' అని నొవాక్ చెప్పాడు. టోర్నీలో యువ ఆటగాడు క్రాజినోవిచ్ చేతిలో శనివారం ఓడిన జొకోవిచ్.. ఆదివారం జ్వెరెవ్‌పై గెలిచినా ఫైనల్ చేరలేకపోయాడు.
జొకోవిచ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చారిటీ టోర్నీలో నొవాక్‌తో పాటు అంతర్జాతీయ టాప్ స్టార్లు డొమినిక్ థీమ్, అలెగ్జాండర్ జ్వెరెవ్, గ్రిగోర్ దిమిత్రోవ్ పోటీపడ్డారు. ఫైనల్లో థీమ్ (ఆస్ట్రియా) 4-3, 2-4, 4-2తో క్రజనోవిక్ (సెర్బియా)ను ఓడించి టోర్నీ విజేతగా నిలిచాడు.
మరోవైపు కరోనా వైరస్ తీవ్రమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యుఎస్ ఓపెన్ నిర్వహించడానికి సిద్ధం అవుతుండడంపై మహిళల ప్రపంచ నం.1 ఆష్లె బార్టీ ఆందోళన వ్యక్తం చేసారు. 'వైరస్ నేపథ్యంలో ఇప్పటికే వింబుల్డన్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలు నిలిచిపోయాయి. యుఎస్ ఓపెన్ అయినా నిర్వహించాలని అనుకోవడంలో అర్థం ఉంది. కానీ క్రీడాకారుల భద్రతకే ప్రధమ ప్రాథాన్యం ఇవ్వాలి' అని బార్టీ పేర్కొన్నారు.
షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 31న యుఎస్ ఓపెన్ ఆరంభం కావాలి. అమెరికాలో ఈ టోర్నీ నిర్వహణపై జకోవిచ్, నాదల్ సహా చాలామంది టెన్నిస్ ఆటగాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా పరీక్షలో నెగటివ్‌గా వచ్చిన టెన్నిస్ క్రీడాకారులను ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చి టోర్నీని షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నది ప్రతిపాదన. దీనిపై ఒక వారంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.