హైదరాబాద్: పన్నెండు సార్లు గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ మరోసారి తండ్రి అయ్యారు. జొకోవిచ్ భార్య జెలెనా శనివారం సాయంత్రం పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చించింది. ఈ మేరకు తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారంటూ సెర్బియా స్ధానిక న్యూస్ పేపర్ బ్లిక్ ఓ కథనంలో పేర్కొంది.
చిన్నారికి తార అని నామకరణం చేయాలని భావిస్తున్నారు. అంతకుముందు జొకోవిచ్-జెలెనాలకు స్టీఫెన్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. మోచేతి గాయం కారణంగా యుఎస్ గ్రాండ్ స్లామ్‌కు దూరమైనట్లు 30 ఏళ్ల జొకోవిచ్ ఇంతకముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకూ 12 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన జొకోవిచ్.. ఇటీవల జరిగిన వింబుల్డన్ ఓపెన్ క్వార్టర్స్ నుంచి అర్థాంతరంగా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో థామస్ బెర్డిచ్‌తో జరగాల్సిన మ్యాచ్ నుంచి హఠాత్తుగా తప్పుకున్నారు. అనంతరం యుఎస్ ఓపెన్‌కు సైతం దూరం కానున్నట్లు జూలై నెలలో జొకోవిచ్ పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత మాత్రమే మళ్లీ బరిలోకి దిగుతానని జొకోవిచ్ స్పష్టం చేశాడు.