పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో తొమ్మిది గ్రాండ్ స్లామ్ టైటిళ్లను నెగ్గిన ఘనమైన చరిత్ర రాఫెల్ నాదల్ సొంతం. అదే జోరుని కొనసాగిద్దామని పదో టైటిల్‌పై కన్నేసిన నాదల్, బుధవారం హోరా హోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు.
యావత్ టెన్నిస్ ప్రపంచం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసింది. పారిస్‌లోని రోలాంగ్ గారోస్‌లో 70-1 ట్రాక్ రికార్డు ఉన్న రాఫెల్ నాదల్, కెరీర్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌పై గురిపెట్టిన నోవాక్ జొకోవిచ్ 7-5, 6-3, 6-1తో నాదల్‌ను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.
ఈ గెలుపుతో ఫ్రెంచ్ ఓపెన్‌లో రాబిన్ సోడెర్లింగ్ (స్వీడన్-2009లో) తర్వాత నాదల్‌ను ఓడించిన రెండో ప్లేయర్‌గా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. ఇదే కోర్టులో వీరిద్దరి మధ్య గతంలో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో రాఫెల్ నాదల్ చేతిలో ఓటమిని చవిచూసిన జొకొవిచ్, ఏడోసారి మాత్రం చరిత్ర తిరగరాశాడు.
ఫ్రెంచ్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ 70 విజయాలు నమోదు చేశాడు. మట్టికోర్టులో 'క్లే కింగ్'గా పేరొందాడు. బుధవారం తన పుట్టినరోజు కావడం విశేషం. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)తో జొకోవిచ్, వావ్రింకా (స్విట్జర్లాండ్)తో సోంగా (ఫ్రాన్స్) తలపడతారు.