For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింబుల్డన్: ఎదురులేని నాదల్, ముర్రె అశలు వమ్ము

By Pratap
Rafel Nadal
లండన్‌: తనకు ఎదురు లేదని రఫెల్ నాదల్ మరో సారి నిరూపించుకున్నాడు. ముర్రే ఆశలను వమ్ము చేస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. రెండో సీడ్‌ నోవాక్‌ జకోవిచ్‌ వింబుల్డన్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం హోరాహోరీగా జరిగిన సెమీస్‌లో జకోవిచ్‌ 7-6(7-4), 6-2, 6-7(9-11), 6-3తో జో విల్ఫ్రెడ్‌ సోంగా (ఫ్రాన్స్‌) జోరుకు అడ్డుకట్ట వేశాడు. మరో సెమీస్‌లో నాదల్‌ 5-7, 6-2, 6-2, 6-4తో ముర్రేపై విజయం సాధించి జకోవిచ్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు.

జకోవిచ్‌-సోంగాల భీకర పోరాటం ఆద్యంతం రక్తి కట్టించింది. తొలిసెట్‌ ఆరంభంలోనే సోంగా భారీ స్ట్రోక్స్‌తో విరుచుకుపడ్డాడు. తొలి గేమ్‌నే బ్రేక్‌ చేసి ఫెదరర్‌తో క్వార్టర్స్‌ మ్యాచ్‌ను తలపించాడు. ప్రత్యర్థి దూకుడుతో జకోవిచ్ మెదడుకు పని పెట్టాడు. ఎనిమిదో గేమ్‌లో రెండు బ్రేక్‌ పాయింట్లను వృధా చేసుకున్నా సెట్‌ పాయింట్‌ను కాచుకుని నిలబడ్డాడు. టైబ్రేకర్‌లో 7-4తో సెట్‌ను దక్కించుకున్నాడు. ఆ స్ఫూర్తితో చెలరేగిన జకోవిచ్‌ కోర్ట్‌ అంతా తానే అయ్యాడు. ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వకుండా రెండో సెట్‌ను 6-2తో గెలిచాడు. మూడో సెట్‌లో కథ మారింది. 11వ గేమ్‌ను బ్రేక్‌ చేసి 6-5తో మ్యాచ్‌ సర్వీస్‌ చేస్తున్న జకోవిచ్‌ సోంగా ధాటికి తడబడ్డాడు. దీంతో మ్యాచ్‌ మరోసారి టైబ్రేకర్‌కు వెళ్లింది. భారీ సర్వీసులతో చెలరేగిన సోంగా 11-9తో సెట్‌ను దక్కించుకున్నాడు. ఐతే జకోవిచ్‌ నాలుగో సెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

కోర్టు అంతా కలియతిరుగుతూ సోంగాకు చెమటలు పట్టించాడు. 6-3తో సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుని సింహనాదం చేశాడు. రెండో సెమీస్‌ ఏకపక్షంగా సాగింది. నాదల్‌కు తొలిసెట్లో మాత్రమే ప్రతిఘటన ఎదురైంది. వరుస బ్రేక్‌లతో హడలెత్తించిన నాదల్‌... 1938 తర్వాత ఫైనల్‌ చేరిన బ్రిటన్‌ ఆటగాడిగా చరిత్ర సృష్టించాలనుకున్న ముర్రేను చిత్తుచేశాడు. ఆదివారం జరిగే ఫైనల్లో నాదల్‌ నెంబర్‌వన్‌ జకోవిచ్‌తో తలపడతాడు.

సానియా జోడీ నిష్క్రమణ: మహిళ డబుల్స్‌ సెమీఫైనల్స్‌లో సానియా(భారత్‌)-వెస్నినా(రష్యా) జోడీ 3-6, 1-6తో రెండో సీడ్‌ చెక్‌ జోడీ క్వెటా పాస్కె-కాతరినా స్రెబోత్నిక్‌ చేతిలో చిత్తయింది. మిక్స్‌డ్‌డబుల్స్‌ క్వార్టర్స్‌లోనూ బోపన్న-సానియా జోడీ 6-1, 2-6, 2-6తో పాల్‌ హాన్లీ(ఆస్ట్రేలియా)-సు వి (తైపీ) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భూపతి-వెస్నినా జోడీ సెమీస్‌ చేరుకుంది. జొనాథన్‌ ఎర్లిచ్‌-షహర్‌ పీర్‌ (ఇజ్రాయెల్‌) జోడీపై 6-4, 6-1తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ కేవలం గంటలోనే ముగిసింది. మరో క్వార్టర్స్‌లో లియాండర్‌ పేస్‌-కారా బ్లాక్‌ జోడీ 3-6, 2-6తో డానియెల్‌ నెస్టర్‌(కెనడా)-యుంగ్‌ జాన్‌చాన్‌ (తైపీ) జోడీ చేతిలో ఓడింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+