హైదరాబాద్: డోపింగ్ నిషేధం ముగిసిన తర్వాత తిరిగి బుధవారం కోర్టులోకి అడుగుపెట్టిన రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా తన పునరాగమనాన్ని ఘనంగా చాటింది. డోపింగ్ నిషేధం ముగిసిన తర్వాత ఆడిన స్టట్‌గార్ట్ ఓపెన్ టోర్నీలో బుధవారం తొలి విజయాన్ని నమోదు చేసింది.
ఏడాదిన్నర నిషేధ విరామం తర్వాత షరపోవా మళ్లీ రాకెట్ పట్టి టెన్నిస్ ఆడింది. స్టట్‌గార్ట్ డబ్బ్యూటీఏ తొలి రౌండ్లో ఆమె ప్రపంచ 36వ ర్యాంకర్ రాబర్టా విన్సిని 7-5, 6-3తో ఓడించింది. ఈ మ్యాచ్ గంటా 45 నిమిషాల పాటు ఆసక్తికరంగా సాగింది. మొదట సెట్‌లో తొలి సర్వీస్ గేమ్‌ను కోల్పోయింది.

కానీ ఆ తర్వాత పుంజుకున్న షరపోవా తొలి సెట్‌ను 7-5 తేడాతో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనే సర్వీస్ కోల్పోయిన షరపోవా.. తర్వాతి గేమ్‌లోనే బ్రేక్ పాయింట్ సాధించింది. ఆ తర్వాత రెండవ సెట్‌లో ప్రత్యర్థిని ఈజీగా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో షరపోవా మొత్తం 11 ఏస్‌లు సంధించింది.
నిషేధిత ఉత్ర్పేరకం మెల్డోనియ్ తీసుకున్న రష్యా ప్లేయర్ షరపోవాపై అంతర్జాతీయ టెన్నిస్ సంఘం ఏడాది పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో షరపోవా 15 నెలలుగా టెన్నిస్‌కు దూరంగా ఉంది.