
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ సమయాన్నిప్లేయర్లు అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే ఆటగాళ్లు దొరికిన ఈ ఖాళీ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోరకంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతుంటే..మరికొందరు తమ ప్రతిభకు పదునుపెడుతున్నారు. అయితే భారత టెన్నిస్ జోడీ లియాండర్ పేస్, మహేశ్ భూపతి ఓ కొత్త చాలెంజ్‌తో అభిమానులను అలరించారు.
డబుల్స్‌లో మాజీ సహచరుడు లియాండర్ పేస్ విసిరిన 'ఫ్రయింగ్ ప్యాన్' చాలెంజ్‌ను టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి స్వీకరించాడు. అయితే లాక్‌డౌన్ సమయాన్ని సరదాగా మార్చేందుకు పేస్ చాలెంజ్ విసిరాడు. 'గయ్స్.. లాక్‌డౌన్‌లో ఉన్న మీకందరికి ఓ సవాలు. ఎంత మంది దీన్ని చేస్తారో చూద్దాం. మీకు చాలెంజ్ విసురుతున్నాను. మీ ఎంట్రీలను ఫ్రైయింగ్ ప్యాన్ చాలెంజ్‌కు పంపండి. అందులో నుంచి బెస్ట్ ఎంపిక చేస్తాను' అని పేస్ ట్వీట్ చేశాడు. ప్యాన్‌తో టెన్నిస్ బంతిని వాలీలుగా కొడుతున్న వీడియోను ట్వీట్ చేశాడు.
ఇందుకు స్పందించిన మహేశ్ భూపతి ఓ చిన్న ప్యాన్‌తో బంతిని కొట్టిన వీడియోను పోస్ట్ చేశాడు. 'లియాండర్.. ఇదిగో నీ సవాలుకు నా ప్రతి సవాలు. కానీ.. నీ అంత నైపుణ్యంగా ప్యాన్‌తో బంతిని కొట్టలేకపోయా' అని భూపతి సరదాగా కామెంట్ చేశాడు. అయితే లియాండర్ బాల్ వైపు చూడకుండా ఫ్రై ప్యాన్‌తో బంతిని కొడితే .. భూపతి మాత్రం చిన్న ప్యాన్‌తో చాలెంజ్‌ను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ ఛాలెంజ్ అందరూ స్వీకరిస్తున్నారు.
ఈ సంవత్సరం లియాండర్ పేస్ (46) కెరీర్‌కు వీడ్కోలు చెప్పనున్నాడు. 1991లోనే తన ప్రస్థానాన్ని ఆరంభించిన పేస్ ఇప్పటి వరకు 28 ఏళ్లకు పైగా టెన్నిస్ ఆట ఆడారు. ఈ సుదీర్ఘ కెరీర్‌లో 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, 55 కెరీర్ టైటిల్స్ ఖాతాలో వేసుకున్నారు. 2016 ఫ్రెంచ్ ఓపెన్ పేస్ చివరి ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఇటీవల 46 ఏళ్ల వయసులో డేవిస్ కప్‌లో 44వ విజయం సాధించి ఈ టోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్లేయర్‌గా పేస్ చరిత్ర లిఖించారు. అయితే ఇటీవలి కాలంలో పేస్ ఆట ఏమాత్రం బాగాలేదు. దాంతో 19 ఏళ్లలో తొలిసారి అతడి ర్యాంక్ 100 కంటే దిగజారింది.