హైదరాబాద్: వయసు పెరిగినా తనలో చేవ తగ్గలేదని భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ మరోసారి నిరూపించాడు. నాక్స్‌విల్లే చాలెంజర్ ట్రోఫీలో పురవ్ రాజాతో కలిసి విజేతగా నిలిచాడు. సోమవారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ పేస్-పూరవ్ 7-6 (4), 7-6 (4)తోసెరెటాని (అమెరికా)-జాన్ ప్యాట్రిక్ (ఆస్ట్రేలియా) జంటపై విజయం సాధించారు.
అరంభం నుంచే హోరాహోరీగా తలపడటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. తన అనుభవంతో పురవ్ జతగా పేస్ చెలరేగి ఆడాడు. గత ఆగస్టులో జోడీ కట్టిన తర్వాత లియాండర్, పురవ్‌కు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. పేస్‌కు ఈ సీజన్‌లో ఇది నాలుగో ఛాలెంజర్ టైటిల్. దీనికి ముందు లియోన్, ఇక్లే, తలహస్సీ టోర్నీల్లో విజేతగా నిలిచాడు.