లక్నో: టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు తాజ్ మహల్ వద్ద నిరాశ ఎదురయింది! సానియా మంగళవారం ఆగ్రాలోని తాజ్ మహల్‌ను చూసేందుకు వెళ్లారు. అయితే, ఆమె ఆలస్యంగా రావడంతో అది కుదరలేదు. అప్పటికే సాయంత్రం కావడం.. సందర్శన సమయం మించిపోవడంతో గేట్లు మూసివేశారు.

దీంతో సానియా మీర్జా దూరం నుండే చూసి.. నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. సమయం మించిపోవడంతో ఆమె వచ్చే కంటే ముందే గేట్లు మూసివేసినట్లు టూరిస్ట్ గైడ్ గౌతమ్ తెలిపారు. తాజ్ మహల్ చూసేందుకు మంగళవారం అవకాశం దొరకకపోవడంతో సానియా తీవ్ర నిరాశ పడ్డారు.
అంతకుముందు మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే తాజ్ మహల్‌ను సందర్శించారు. అనిల్ కుంబ్లే తాజ్ మహల్ అందాలను చూసి మురిసిపోయాడు. అనిల్ కుంబ్లే, సానియా మీర్జాలు అగ్రాలోని జేపీ ప్యాలెస్ హోటల్‌లో ఓ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వచ్చారు.